జోకేసినందుకు లోపలేశారు....
posted on Jan 20, 2015 @ 9:19PM
సాధారణంగా ఎవరైనా జోకేస్తే ఎదుటివాళ్ళు నవ్వుతారు. కానీ ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు కుర్రాళ్ళు జోకేసిన పాపానికి జైల్లో పడ్డారు. ఇంతకీ వాళ్ళు జోకు చేసింది ఎవరితోనో కాదు.. సాక్షాత్తూ పోలీసులతో. ఎంత పోలీసులైతే మాత్రం జోకు వేసినంత మాత్రాన అరెస్టు చేస్తారా అనే సందేహం రావొచ్చు.. కానీ వాళ్ళు వేసిన జోక్ ఏంటనుకుంటున్నారు... ఒక పెద్ద సభలో బాంబు పెట్టామని పోలీసులతోనే అన్నారు. పోలీసులు బిత్తరపోతే, ఊరికే జోక్ చేశాం అని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు వినకుండా ముగ్గుర్నీ మడతపెట్టి లాకప్పులో వేశారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరానికి పోప్ వచ్చిన సందర్భంగా 60 లక్షల మంది క్రైస్తవులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం బందోబస్తు చూస్తున్న పోలీసుల దగ్గరకి వెళ్ళిన ఈ ముగ్గురు యువకులు ఈ సభలో బాంబు పెట్టాం అని, ఆ తర్వాత జోకేశాం అని నవ్వేశారు. పోలీసులు వీళ్ళని అరెస్టు చేసి, ఆ విషయాన్ని పోప్ వెళ్ళిపోయిన తర్వాత బయటపెట్టారు. ఆ యువకులు జోకు వేశారని మాకు తెలుసు. అయితే 60 లక్షల మంది వున్న సభలో ఈ మాట బహిరంగంగా అంటే భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగే ప్రమాదం వుంది. అందుకే అలాంటి కుళ్ళు జోకు వేసిన వారిని అరెస్టు చేశాం అని చెప్పారు. ఓ నాలుగైదు రోజులు వాళ్ళని కుళ్ళబొడిచి మరోసారి ఇలాంటి కుళ్ళు జోకులు వేయకూడదని బుద్ధి వచ్చేలా చేసి వదిలిపెట్టేస్తామని పోలీసులు తెలిపారు.