ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. నవ్వులపాలైన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ట్వీట్
posted on Mar 10, 2025 @ 2:03PM
వైసీపీ మరో సారి నవ్వుల పాలైంది. ఈ సారి ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ మొత్తం పార్టీనే నవ్వుల పాలు చేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం ( మార్చి 9) జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్ టీమ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అన్ని వర్గాల నుంచీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశం యావత్తూ ఈ చారిత్రాత్మక విజయంతో సంబరాలు చేసుకుంది.
ఈ విజయాన్ని వైసీపీ కూడా ఆస్వాదించింది. అయితే ఈ సందర్భాన్ని తమ పార్టీకి బూస్ట్ వచ్చే విధంగా మలచుకోవడానికి ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ వైసీపీని నవ్వుల పాలు చేసింది. వైసీపీ నాయకుడు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్య టి. చంద్రశేఖర్ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను అభినందిస్తూనే.. పనిలో పనిగా గత ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన 11 స్థానాలను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన టీమ్ ఇండియా ఎలాంటి పొత్తులూ లేకుండా కేవలం 11 మందితో ఆడి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందనీ, అదే విధంగా 2029 ఎన్నికలలో వైసీపీ విజేతగా నిలుస్తుందనీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వెంటనే ఈ పోస్టు ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురైంది.
ఆటల్లో పొత్తులుండవు గురూ.. అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందా అంటు మరి కొందరు ఎద్దేవా చేశారు. ‘ఎవరి పొత్తూ లేకుండా టీమ్ ఇండియా 11 మంది సభ్యులతో నిజాయితీగా కప్ గెలిచింది. నాలుగేళ్ల తరువాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది’ అన్నది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టీ. చంద్రశేఖర్ చేసిన ట్వీట్.
ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఇండియా చాంపియన్స ట్రోఫీ గెలిచిందని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే కావచ్చు.. కానీ అందుకు ఆయన ఆటగాళ్ల సంఖ్యను కూడా పేర్కొనడం, అది నేరుగా గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యే కావడంతో నెటిజనులు ఓ రేంట్ లో ట్రోల్ చేశారు. పాపం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నీ, విశ్వాసాన్ని నింపడానికి చేసిన ట్రీట్ బూమరాంగ్ అయ్యింది. టీమ్ ఇండియా ఎప్పుడూ వైనాట్ 175 అనలేదనీ ఎన్డీయే మద్దతు దారులు ఎద్దేవా చేస్తున్నారు.