ప్రణవ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణ శిక్ష
posted on Mar 10, 2025 @ 1:37PM
2018లో మిర్యాల గూడలో సంచలనమైన ప్రణవ్ హత్య కేసులో రెండో అడిషనల్ కోర్టు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఎ 2గా ఉన్న సుభాష్శర్మకు మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బీహార్ కు చెందిన సుభాష్ శర్మకు అనేక క్రిమినల్ కేసుల్లో ముద్దాయి. ముఖ్యంగా సుపారీ హత్యలు చేయడంలో సిద్ద హస్తుడు. ప్రణవ్ హత్య కోసమే సుభాష్ శర్మను బీహార్ నుంచి మిర్యాల గూడకు రప్పించారు. ఎ1 ముద్దాయి అయిన మారుతీరావ్ రప్పించినట్లు పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. . ఈ కేసు విచారణ జరుగుతుండగానే మారుతీరావ్ ఆర్యవైశ్యభవన్ లో సుసైడ్ చేసుకున్నాడు. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా మారుతీరావు ప్రణవ్ ను హత్య చేయించాడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు సుభాష్ శర్మ ఆచూకీ కోసం పోలీసులు అప్పట్లో తీవ్రంగా గాలించారు. జిల్లా ఎస్పీగా ఉన్న రంగనాధ్ దర్యాప్తును స్పీడప్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేశారు. సాక్షుల పేర్లను గోప్యంగా ఉంచారు. ప్రత్యేక బృదాలను రంగంలో దింపిన ఎస్పీ ఎంతో చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.
మారుతీరావు కూతురు అమృత.. కులాంతర వివాహం చేసుకోవడంతో అవమానంగా భావించిన మారుతీరావు... సుఫారీ ముఠాతో అల్లుడిని హత్య చేయించాడు. ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మారుతీరావుతో పాటు మరో ఏడుగురు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసులో మిగతా నిందితులకు యావజ్జీవ శిక్ష విధించారు. 1600 పేజీలతో కూడిన చార్జ్ షీట్ లో తగిన ఆధారాలు బలంగా ఉండటంతో నిందితులు తప్పించుకోలేకపోయారు.