విజయ శాంతికి ఎందుకంటే?
posted on Mar 10, 2025 @ 3:27PM
కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఎంతో కాలంగా పార్టీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో, విశ్వసనీయంగా పనిచేస్తున్న అద్దంకి దయాకర్ కి టికెట్ ఇచ్చింది. ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష, ఉద్యమ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న అద్దంకి దయాకర్ కు చట్టసభలో ప్రవేశించే అర్హతలన్నీ ఉన్నాయి. అయినా, చట్టసభలో కాలు పెట్టాలన్న ఆయన కోరిక ఇంతవరకూ నెరవేర లేదు. కారణాలు ఏవైనా అనేక సార్లు అవకాశాలు,తలుపు తట్టి మాయమై పోయాయి. చిక్కినట్లే చిక్కి చేజారి పోయాయి.
అయితే ఏదయితే ఏం కానీ, చిట్ట చివరకు, అద్దంకి దయాకర్ చిరకాల స్వప్నం సాకార మయ్యే సదవకాశం లభించింది.దయాకర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు పార్టీ టికెట్ దక్కింది. ఆ ఇద్దరి విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే, సిపిఐకి ఒక సీటు ఇవ్వడం కొంచెం ఎక్కువ అనిపించినా, సరే అని సరి పెట్టుకోవచ్చును. ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక, నల్గొండ సెంట్రిక్గా సాగిన నేపధ్యంలో సిపిఐకి ‘ఉచిత’ గ్యారెంటీల కోటాలో ఒక టికెట్ ఇవ్వడాన్ని కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చును.
కానీ కాంగ్రెస్ పార్టీలో అని కాదు అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియని రాములమ్మ విజయశాంతికి కాంగ్రెస్ అధిష్టానం ఏమి ఆశించి టికెట్ ఇచ్చిందో ఏ లెక్కన ఆమెను పెద్దల సభకు పంపాలని నిర్ణయించిందో మనకే కాదు.. కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ కు కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ‘ముఖ్య’ నాయకులకు అయితే అసలు మింగుడు పడడం లేదని అంటున్నారు.
అందుకే విజయ శాంతి విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ నాయకులు కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న వీహెచ్, మధుయాష్కి గౌడ్ వంటి ఐడిలాజికల్ కమిటెమెంట్ ఉన్న సీనియర్ నాయకులను కాదని, స్థిరత్వం లేని, గాలివాటం రాజకీయాలకు అలవాటు పడిన విజయశాంతికి ఏ లెక్క టికెట్ ఇచ్చారనే ప్రశ్న పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. అంతే కాకుండా, ఓ వంక కోవర్టుల కారణంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్ట పోతోందని అంటూ, మరో వంక నిన్నమొన్నటి వరకు బీజేపీలో ఉన్న విజయ శాంతికి టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నిజమే, ఒకప్పడు విజయశాంతికి, అటు సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మంచి పేరున్న మాట నిజం. అయితే అదంతా ఇప్పడు గతం.ఇప్పడు ఆమె సినిమాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కన్నాంబ క్యారెక్టర్ కు తక్కువ అన్నట్లు ఉన్నారు. అప్పుడెప్పుడో, మహేష్ బాబు సినిమాలో కాసింత గుర్తింపున్న రోల్ లో నటించారు. అంతే, ఆ తర్వాత ఆమె వెండి తెర మీదనే కాదు. బుల్లి తెర మీద కూడా కనిపించలేదు. రాజకీయాల్లోనూ అంతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు పార్టీ స్టార్ క్యాంపైనర్ ట్యాగ్ తగిలించింది. అయినా ఆమె పెద్దగా ప్రచారం చేసిందీ లేదు. ఒరగ పెట్టింది అంత కంటే లేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె కంట్రిబ్యూషన్ ఇంచుమించుగా జీరో.
ఇక ప్రస్తుతానికి వస్తే, ఆమె అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించిన దాఖాలాలు లేవు. గాంధీ భవన్ గడప అయినా తోక్కారో లేదో తెలియదు. అంతే కాదు ఎమ్మెల్సీ టికెట్ కోసం అయినా ఆమె రాష్ట్ర నాయకులు ఎవరినీ కలవ లేదు. రాష్ట్ర పార్టీని, రాష్ట్ర నాయకులను ఇగ్నోర్ చేస్తూ నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానం కోటాలో టికెట్ తెచ్చుకున్నారు. నిజమో కాదో గానీ, ఆమెకు టికెట్ ఇస్తున్న విషయం రాష్ట్ర ‘ముఖ్య’ నాయకులకు కూడా చివరి నిముషం వరకూ తెలియదంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం, ఏ అర్హతలు చూసి ఆమెకు టికెట్ ఇచ్చింది అనేది, ఇప్పడు కాంగ్రెస్ నాయకులకు సైతం అర్థం కాని, ప్రశ్నగా మిగిలింది.
అయితే., బీఆర్ఎస్, బీజేపీలను సమర్ధంగా ఎదుర్కునేందుకు, అధిష్టానం విజయ శాంతికి ఎమ్మెల్సీ టికట్ ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. కానీ ఆమెకు అంత సీన్ లేదని, పాతికేళ్ళకు పైగా రాజకీయాల్లో ఉన్నా, బీజేపీతో మొదలు పెట్టి, సొంత పార్టీ పెట్టి, బీఆర్ఎస్ లో కలిసి, కాంగ్రెస్’ లో చేరి, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన ఆమెకు రాజకీయ నిబద్దత మాత్రమే కాదు, అవగాహన కూడా లేదంటున్నారు. రాజకీయ భాషపై పట్టు అబ్బనే లేదని, ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసింది, బట్టీపట్టి సినిమాటిక్ గా చెప్పడమే కానీ , అందరికీ అర్థమయ్యేలా, అందరినీ ఒప్పించేలా మాట్లాడలేరని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఏమి చూసి విజయశాంతికి టికెట్ ఇచ్చారు అన్నది .. పజిలింగ్ గానే మిగిలింది.