సీఎస్ పదవీ కాలం పొడిగింపు లేనట్లే కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్?
posted on Jun 21, 2021 @ 2:56PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పదవీ కాలం జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కనీసం మరో ఆరు నెలల వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు సుముఖంగా ఉన్నారు. అయన సుముఖంగా ఉండడమే కాదు, అందుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు ఆయన తమ పలుకుబడిని వినియోగించారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల వద్ద సీఎస్ పదవీ కాలం పొడిగింపు ప్రస్తావన చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కారణాలు ఏవైనా, సీఎం అభ్యర్ధనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. ముందు మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు మొత్తం ఆరు నెలలు పొడిగింపు ఉంటుందని, అధికార వర్గాలను ఉతంగిస్తూ వార్త లొచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఆదిత్యనాధ్ దాస్‌కు, పొడిగింపు ఇవ్వకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధానంగా రెండుకారణాలు చెపుతున్నారు. అందులో, మొదటి కారణం, ‘దేవుడు వరమించిన పూజారి కరుణించలేదు’ అన్నట్లుగా ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు ముఖ్యమత్రికి ఇష్టం (అవసరం) అయినా, ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పే ఒక అస్మదీయ అధికారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే, ఆయన చాకచక్యంగా సిఎస్ పదవీ కాలం ఫైల్’ను పక్కదారి పట్టించి, సకాలంలో ముఖ్యమంత్రి టేబుల్ మీదకు రాకుండా చక్రం తిప్పారు. చివరకు ఆయన ఆశించిన విధంగానే సీఎస్ పదవీ కాలం పొడిగింపు అభ్యర్ధన లేఖ కేంద్రానికి ఆలస్యంగా చేరింది. దీంతో ఆదిత్యానాథ్ పదవీకాలం పొడిగింపు అంశం సాంకేతిక చిక్కుల్లో చిక్కుకు పోయిందని, ఈ కారణంగా పొడిగింపు ఉండక పోవచ్చని అధికారులు చెపుతున్నారు.
అదలా ఉంటే కొద్ది రేజుల క్రితం తెలుగు దేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీందర్ కూడా, సీఎస్’కు సర్వీసు పొడిగింపు ఇవ్వవద్దని కోరుతూ డిఓపిటికి లేఖ రాశారు. అయన తమ లేఖలో అధిత్యనాద్ దాస్’కు జగన్ అక్రమాస్తుల కేసులతో ఉన్న లింకులను ప్రస్తావించారు. “2013, జగన్ రెడ్డిపై సేబేఐ నమోదు చేసిన క్విట్ ప్రో కో కేసులో ఆదిత్యానాథ్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్నారు. జలవనరులశాఖ కార్యదర్శిగా, జగనమోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్’కు నీటిని కేటాయించడంలో అధికార పరిధిని అతిక్రమించి అనవసర సహాయ, సహాకారాలు అందిచారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అదిత్యానాథ్ పై కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై, సీబీఐ అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 2019 సెప్టెంబర్’లో ఆకేసులకు సంబంధించి సుప్రీం కోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారి పదవీ కాలం పొడిగించడం సరికాదు” అని కనకమేడల తమ లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్య అధికారి ప్లే చేసిన ట్రిక్ పనిచేసిందో లేక కనకమేడల రాసిన లేఖ ప్రభావం చూపిందో గానీ, మొత్తానికి ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు అవకాశాలు అటకెక్కాయి. అందుకు అవకాశమే లేదని, అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో, ఏపీ కొత్త సీఎస్ ఎంపికకు రేస్ మొదలైనట్లు చెపుతున్నారు. ఈ రేసులో ప్రస్తుత సమాచారం మేరకు, సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ ముందున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 1986 బ్యాచ్‌కి చెందిన సతీష్‌చంద్ర, 1987 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్ ఐఏఎస్ జెఎస్వీ ప్రసాద్, 88 బ్యాచ్‌కు చెందిన గిరిధర్, పూనం మానకొండయ్య రేసులో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న గిరిధర్, రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు. ఇక ముక్కసూటి అధికారిగా పేరున్న జేస్వీ ప్రసాద్‌ను తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సుముఖంగా లేరని చెబుతున్నారు. సతీష్‌చంద్ర గత సీఎం చంద్రబాబు పేషీలో కీలకపాత్రపోషించినందున, ఆయనకు అవకాశాలు ఉండకపోవచ్చంటున్నారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే, ప్రస్తుత సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు చక్రం అడ్డువేసిన సీఎంఓ కీలక అధికారే, సీఎస్‌గా నీరబ్‌కుమార్ ఎంపికలోనూ చక్రం తిప్పారని అధికారవర్గాల సమాచారం. ఈ ఉదంతం నిజమైతే, సీఎం, సీఎస్ కంటే సీఎంఓలో చక్రం తిప్పే రింగ్ మాస్టర్’ కే పవర్ ఎక్కువని మరోసారి రుజువైనట్లవుతుంది.
కాగా, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, 2000 సంవత్సరం డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్, 2021 జనవరి 1 న పదవీ బాధ్యతలు చెప్పట్టారు. ఆరు నెలలోనే పదవీ విరమణ చేస్తున్నారు