మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి.. రౌడీ రాజ్యమని చంద్రబాబు ఫైర్
posted on Jul 27, 2021 @ 9:09PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. సామాన్య జనాలనే కాదు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వసమయ్యాయి.
గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను పరిశీలించేందుకు వెళ్లారు దేవినేని ఉమ. అక్రమ మైనింగ్ను పరిశీలించి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద ఉమా వాహనం పై రాళ్ళ దాడికి దిగారు దుండగులు.రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని దేవినేనిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పీఎస్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. అయినా ఘటన జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సీఎం జగన్ కనుసన్నల్లో, సజ్జల నాయకత్వంలో తనపై దాడి జరిగిందని దేవినేని ఉమ ఆరోపించారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తనపై రాళ్లురువ్వారని మండిపడ్డారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ జరిగిందన్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్నానని తనపై కక్షగట్టారని ఆరోపించారు. తన అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. గ్రావెల్ దోపిడీపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా..? అని ఉమ ప్రశ్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. దాడిపై డీజీపీ, విజయవాడ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై జరిగిన దాడిపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత గంట సేపు ఎవరూ రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు గాయపడ్డారన్నారు. పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉమకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీని చంద్రబాబు కోరారు