రామప్పలో నమ్మలేని నిజం: 800 ఏళ్ల క్రితమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ
posted on Jul 27, 2021 @ 9:09PM
రామప్ప ఆలయ వైభవం, అందులోని శిల్పకళా నైపుణ్యం గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పుకోవడమే కానీ.. అసలక్కడి ఆహాలకు, ఓహోలకు అసలైన ఆనవాళ్లేంటో ఎవరూ చెప్పడం లేదు. అదేంటో తెలుగువన్ డాట్ కామ్ పాఠకులకు మేం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చదివి ఆనందించండి.. మన శిల్పాచార్యుల నైపుణ్యానికి గర్వించండి.
1213 లో నిర్మాణమైన రామప్ప ఆలయాన్ని ఆనాటి శిల్పాచార్యులు 40 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. అంటే దాదాపు ఒక తరం పూర్తిగా, రెండో తరం కొంత భాగం జీవితకాలాన్ని ధారవోశారు. అనేక అద్భుతమైన గుళ్లు, గోపురాలను ఇలాగే తీర్చిదిద్దారు. ఇక రామప్ప ఆలయం గురించి సామాన్య ప్రజలకు తెలియని విషయం మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం.
రామప్పను ఇదివరకే దర్శించినవారికి అక్కడ ఆలయంలో ఓ విగ్రహాన్ని మీటితే అది సరిగమలు పలుకుతుందని తెలుసు. అయితే ఒక రాతి చెక్కడం వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలైన శబ్దాలను ఏ విధంగా ఇవ్వగలుగుతుందన్నది ఇటీవలి కాలం వరకు కూడా ఎవరికీ తెలియదు. నమ్మశక్యం కాని ఆ టెక్నాలజీ పేరే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ. అంటే ఇతర లోహాల్లాగే రాతిని కరిగించి తాము అనుకున్న ఆకారంలోకి ఒంపుకోవడం. రాయేంటి.. దాన్ని కరిగించడమేంటి అనిపిస్తోంది కదా... అందుకే ఇది నమ్మలేని నిజం.
రామప్ప ఆలయంలో వివిధ శబ్దాలు చేసే (సరిగమలు పలికే) శిల్పాలతో పాటు కొన్ని స్తంభాలకు సైతం ఈ టెక్నాలజీ వాడారు. అన్ని విగ్రహాలకు, అన్ని శిల్పాలకు దీన్ని వాడలేదు. ఇది కృష్ణుడు వేణువు వాయిస్తున్న శిల్పంలో బయట పడింది. ఆ శిల్పంలో వేర్వేరు చోట్ల తడిమితే వేర్వేరు శబ్దాలు వస్తున్నాయి. ఇంకో చోట అసలు ఏ శబ్దమూ రావడం లేదు. మామూలు పరిస్థితులకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యవహారం.
వస్తువు సాంద్రత మారడం వల్ల అది వెలువరించే శబ్దాల్లో మార్పు సాధ్యమవుతుంది. అదే సూత్రాన్ని ఆనాటి శిల్పాచార్యులు ఇక్కడ అప్లై చేశారు. అలాగే నల్లరాతి శిల్పంలో మన ప్రతిబింబం చూసుకునేంత నునుపుదనం ఊహించశక్యం కానిది. మామూలు చెక్కడాల్లో అంత నునుపుదనం రాదని అనుభవజ్ఞులు సైతం చెబుతున్నారు. ఆ నునుపుదనం, నాజూకుదనం రావడానికి, రాతిలో సాంద్రతను మార్చి శబ్దాల్లో మార్పులు రావడం కోసమే రాక్ మెల్టింగ్ టెక్నాలజీ వాడినట్లు 2016లో జరిగిన పరిశోధనల ద్వారా రుజువైంది. న్యూయార్క్ లోని బఫలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాతిని 2500 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర కరిగించి మోల్డ్ చేయవచ్చని నిరూపించారు. దీంతో 800 ఏళ్ల క్రితం రామప్పలో చేసింది కూడా అదే టెక్నాలజీగా నిర్ధారణ అవుతోంది.
సన్నని, నునుపైన ఇసుకను ముందుగా ఊహించుకున్న ఆకారం మేరకు పేర్చి, కూర్చి మూసగా తయారుచేసి... అందులోకి కరిగిన రాతి ద్రవాన్ని (లావా అన్నమాట) పంపించి చల్లబరుస్తారు. దీంతో ఆ రాతి సాంద్రతలో తేడాలు వస్తాయి. ఫలితంగా ధ్వనుల్లో కూడా తేడాలు వస్తాయి. అలాగే గుడి శిఖరానికి ఉపయోగించిన రాళ్లకు నీళ్లమీద తేలియాడే గుణం కూడా ఇలాగే రాబట్టారు. రాతిని కరిగించినప్పుడు ఇతరత్రా మరికొన్ని ఖనిజాల మూలకాలు కలపడం ద్వారా ఆ రాయి సాంద్రత గణనీయంగా తగ్గిపోయింది. ఆ తగ్గిన రాళ్లనే అనుకున్న ఆకారంలో దిమ్మెల్గుగా చెక్కి గుడిని తేలికగా మార్చడం జరిగింది. పాలంపేట పరిసరాల్లో ఉన్న నల్లరాతి నేలను తట్టుకొనేందుకు ఇంతటి భారీ టెక్నాలజీని 800 ఏళ్ల క్రితమే మనవాళ్లు వాడారంటే... ఆనాటి శిల్పాచార్యులు ఎంత గొప్ప శాస్త్రవేత్తలో అర్థం చేసుకోవచ్చు. రామప్పలో సరిగమలు పలికే శిలలో జరిగింది కూడా ఇదేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.