కొవిడ్ టీకాతో సేఫ్ రెండు నెలలే! తాజా అధ్యయనంతో కలకలం..
posted on Jul 28, 2021 9:24AM
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే డెల్టా వేరియంట్ వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో మరణ మృదంగం మోగించిన డెల్టా వేరియంట్... ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలను వణికిస్తోంది. కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషనే ప్రధానమని సైంటిస్టులు చెప్పడంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి కొవిడ్ గండం తప్పినట్లేనని చెబుతూ వస్తున్నాయి. కొన్ని దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రకటించాయి.
అయితే కొవిడ్ టీకాలపై తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఆందోళన కల్గిస్తోంది. రెండు టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరు వారాల తర్వాత క్రమంగా క్షీణిస్తున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తఅధ్యయనంలో తేలింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలపై అధ్యయనం చేసి ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేతలు. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు వాళ్లు గుర్తించారు. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా అవి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న సైంటిస్టులు చెప్పారు, ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భారత్‌లో ఇస్తున్న కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం బుధవారం వెల్లడించింది.
తాజాగా అమెరికా కూడా తమ కొవిడ్ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. కొంతకాలం క్రితం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ దేశంలో డెల్టా వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ప్రజలు మాస్కులు ధరించడమే మంచిదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఉండే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది. కే-12 స్కూళ్లలో పనిచేసే టీచర్లు, విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా స్కూళ్లలో కూడా మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది.