ఇండియా కూటమికే వైసీపీ జై!?
posted on Aug 8, 2024 @ 4:18PM
వైసీపీ తన బాట ఏమిటో నిర్ణయించేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత కేంద్రంలో బీజేపీకి వత్తాసు పలకడం వల్ల ఇక ఉపయోగం లేదని నిర్ణయించుకుందా? అంటే గురువారం (ఆగస్టు 8) లోక్ సభలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు చూస్తే ఔనని అనిపించక మానదు. జగన్ తన మెడపై వేళాడుతున్న అక్రమాస్తుల కేసుల నుంచి బీజేపీ రక్షిస్తుందన్న ఉద్దేశంతో ఆ పార్టీ తెలుగుదేశంతో జత కట్టినా ఇప్పటి వరకూ మోడీపై కానీ, కమలం పార్టీపై కానీ విమర్శలకు పాల్పడలేదు.
చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయంటూ ఆయన హస్తినలో ధర్నా చేసిన సమయంలో కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీని పల్లెత్తుమాట అనలేదు. అదే సమయంలో ఇండియా కూటమి పార్టీలను ధర్నాకు ఆహ్వానించారు. ఒక విధంగా తనకు మద్దతు ఇవ్వకుంటే రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తేందుకు, బిల్లుల ఆమోదం విషయంలో సహాయ నిరాకరణ చేసేందుకు వెనుకాడేది లేదన్న సందేశాన్ని పంపారు. అక్కడితో ఆగకుండా ధర్నా అనంతరం తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండు సార్లు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అయిన అమిత్ షా వద్దకు రాయబారానికి పంపారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో ఇక అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆ విశ్లేషణలకు అనుగునంగానే వైసీపీ సభ్యులు లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించింది. మోడీ సర్కార్ లోక్ సభలో వక్ఫ్ బోర్డు బిల్లును గురువారం (ఆగస్టు 8) లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. లోక్ సభలో వైసీపీ వ్యతిరేకత వల్ల మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందీ కలగదన్న సంగతి విదితమే. అయితే ప్రస్తుత పరిస్థితిలో రాజ్యసభలో కూడా వైసీపీ ఇదే పద్ధతిని అనుసరిస్తే బీజేపీకి ఒకింత ఇబ్బందే. దీంతో లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ తన అడుగులు ఇండియా కూటమి వైపే అన్నస్పష్టమైన సంకేతాన్ని పంపారు.
దీంతో ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం లేకుండానే బిల్లుల ఆమోదానికి అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వైసీపీ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో బీజేపీ టచ్ లోకి వెళ్లింది. ఇక ఆ పార్టీల నుంచి కమలంలోకి జంపింగులు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇంత వరకూ అటూ ఇటూ అన్నట్లుగా ఊగిసలాట ప్రదర్శించిన జగన్ ఇక కమలం పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించడం ద్వారా తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.