వైసీపీకి చావో..రేవో!
posted on Aug 8, 2024 @ 3:58PM
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసిపికి చావో..రేవోగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరుగనున్న ఈ ఎన్నికలను వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సీనియర్ నేత బొత్సను బరిలోకి దింపింది. అయితే పరిస్థితులు వైసీపీకీ ఏ మాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో విజయాన్ని నల్లేరుపై నడకలా మార్చు కోవాల నీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది
వాస్తవంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలలో వైసీపీకి పూర్తి ఆధిక్యత ఉంది. అయితే వైసీపీకి ఆధిక్యత ఉన్న విశాఖ గ్రేటర్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి విజయం సాధించింది. అనూహ్యంగా అక్కడ కొందరు కార్పొరేటర్లు జన సేనలో చేరి వైసిపికి ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీకి పూర్తి బలం ఉన్నప్పటికీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. కూటమి పార్టీలు ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ వైసీపీ బలాన్నీ చీలుస్తున్నాయి.
విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ జగన్ స్వయంగా ఓటర్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా వైసీపీ నేతల్లో కానీ, శ్రేణుల్లో కానీ గెలుపు ధీమా కనిపించడం లేదు. స్థానిక సంస్థలలో వైసిపికి 600 పైగా స్థానాలలో బలం ఉంది. టిడిపికి కాస్త అటు ఇటుగా 200 పై చిలుకు ఓటర్లు మాత్రమే ఉన్నారు. మామూలుగా అయితే ఈ ఉప ఎన్నికలలో వైసీపీ విజయం సునాయాసమే కావాలి. ఎందుకంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య 387 ఓట్ల తేడా ఉంది.
అయితే రెండు పార్టీల మధ్య 387 ఓట్లు తేడా ఉంది. అయితే వైసీపీ బలం రోజు రోజుకూ తగ్గిపోతున్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల వైసీపీ ప్రతినిథులు పెద్ద సంఖ్యలో జనసేన లేదా తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వారితో వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు గోడ దూకేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసి క్యాంపులకు తరలిస్తోంది. అయితే ఇప్పటికే పలువురు కూటమి పార్టీల వైపు దూకేయడంతో మిగిలిన వారినైనా కాపాడుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే రానున్న రోజులలో వైసీపీ నుంచి వలసలు మరింతగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం వైసీపీకి చావో రేవోగా మారిపోయిందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.