బంగ్లాలోని భారత వీసా కేంద్రాల మూసివేత
posted on Aug 8, 2024 @ 4:39PM
బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని ఇండియన్ వీసా కేంద్రాలను మూసివేయాలని భారత్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
నిరసనకారులు బంగ్లా ప్రధాని భవనాన్ని చుట్టుముట్టడం, సైన్యం ఆందోళనకారులను అదుపు చేయడంలో చేతులెత్తేయడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా నిరసనలు చల్లారలేదు. దేశం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని భారత దౌత్య అధికారులు ఆ దేశంలోని ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసి వేశారు. అశాంతి, భారీ నిరసనల కారణంగా బంగ్లాదేశ్‌లోని అన్ని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ బంగ్లాదేశ్ లోని అన్ని భారత వీసా కేంద్రాలూ మూసి ఉంటాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ పోర్టల్‌లో మెసేజ్ పెట్టారు.
కాగా, దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్, కాన్సులేట్‌ల నుండి 190 మంది అనవసర సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఇండియా ఖాళీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం జరిగింది. అయితే, దౌత్యవేత్తలందరూ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. అలాగే మిషన్లు పనిచేస్తాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై కమీషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్హెట్‌లలో కాన్సులేట్‌లను భారత్ కలిగి ఉన్న విషయం తెలిసిందే.