మేమే పోటీ చేస్తాం.. మీరు తప్పుకోండి!
posted on Mar 10, 2025 @ 5:26PM
వారసులను పక్కన పెట్టే యోచనలో వైసీపీ సీనియర్లు..
వైసీపీలోని కొందరు సీనియర్లు తమ మనస్సు మార్చుకుంటున్నారట. గడచిన ఎన్నికల్లో తమకు ఈ రాజకీయాలు వద్దు.. తమ వారసులకు టిక్కెట్లివ్వండని ఆ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి మరీ తమ వారసులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి, పేర్ని నాని వంటి వారు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఇలా వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్న వారిలో కొందరు తిరిగి తామే పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. గడచిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో పాటు.. వారసులెవరూ తాము అనుకున్న విధంగా రాణించ లేకపోతున్నారు. దీంతో మళ్లీ రంగంలోకి దిగాలని రాజకీయాలకు దూరం అని గతంలో చెప్పుకున్న కొందరు నేతలు భావిస్తున్నారట.
తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గంగాధర నె ల్లూరు నుంచి కృపాలక్ష్మీ, బందరు నుంచి పేర్ని కిట్టు పోటీ చేశారు. వీళ్లంతా సైకిల్ స్పీడును, గాజు గ్లాస్ కోతను తట్టుకోలేకపోయారు.. అల్లాడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తాము జోక్యం చేసుకోకపోతే.. తమ కుటుంబాల రాజకీయ భవిష్యత్ కు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడేట్టుందనే ఆందోళన ఆయా పుత్ర రత్నాల తండ్రులలో వ్యక్తమౌతోందట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వారసుల కంటే.. తండ్రులే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు. తెలుగుదేశం నేతలతో.. ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితి కన్పిస్తోంది. గంగాధర నెల్లూరు మినహా.. వారసులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ తండ్రులే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
ఇలా ఆలోచించే వారిలో ముఖ్యంగా పేర్ని నాని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బందరు నుంచి తానే రంగంలోకి దిగాలని దాదాపు డిసైడైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పేర్ని నాని తన సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. తన వారసుడు పేర్ని కిట్టునే మళ్లీ పోటీ చేస్తే.. గెలవడం కష్టమేమోననే ఆందోళవతో ఉన్నారట పేర్ని నాని. గడచిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే తాను రాజకీయాలకు దూరంగా వెళ్లిపోతానని.. ఈ రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని..ఇలా చాలానే చెప్పారు పేర్ని నాని. ఇంత త్వరగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం కరెక్ట్ కాదని.. చాలా మంది చెప్పి చూశారు. కానీ పేర్ని నాని నాడు వినలేదు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందారు. ఇప్పుడు మారిన పరిణామాలతో పేర్ని నాని తిరిగి పోటీ చేయడానికి దాదాపు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా పేర్ని నాని ప్రస్తావిస్తున్నారని సమాచారం.
పేర్ని నాని తరహాలోనే మరి కొందరు కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో కూడా తాము సునాయాసంగా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్సుతో వారసులను రంగంలోకి దించారు.. కొందరు వైసీపీ నేతలు. దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలనే థియరీని అనుసరించి.. వారసులకే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ.. వారు అనుకున్నదొకటైతే.. దేవుడి స్క్రిప్ట్ మరో రకంగా ఉంది. వారసులను పొలిటికల్ గా సెటిల్ చేద్దామనుకుంటే.. ఏకంగా ఫ్యామిలీయే రాజకీయాలకు దూరమైపోయే పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారు పుత్ర రత్నాలు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వారసులను పక్కన పెట్టి.. మళ్లీ తామే రంగంలోకి దిగాలని భావిస్తున్నారట సదురు తండ్రులు.