రేవంత్ కేబినెట్ లోకి విజయశాంతి?
posted on Mar 10, 2025 @ 5:39PM
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్ఠానం నిర్ణయం దిగ్భ్రమకు గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు.
అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఠాక్రే అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతోంది. సరే మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలిక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్ఠానమే ఖరారు చేసింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా తక్కువగా ఉన్నారనీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ వినా కేటీఆర్, హరీష్ ల విమర్శలకు దీటుగా బదులిస్తున్న దాఖలాలు లేవనీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు.