ఎట్టకేలకు 27 మందితో వైసీపీ ఇన్ చార్జిల జాబితా
posted on Jan 2, 2024 @ 9:27PM
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటూ హడావుడి చేస్తున్న జగన్ నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పే అందుకు కొలమానంగా ఎంచుకున్నారు. తొలుత ఆర్భాటంగా 11 మంది ఇన్ చార్జీలను మార్చేసిన జగన్ రెండో విడత మార్పులను ప్రకటించేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేడు, రేపు అంటూ తాత్సారం చేసి, అసంతృప్తుల బుజ్జగింపు సమన్వయకర్తలకు అప్పగించి ఎట్టకేలకు మంగళవారం రాత్రి రెండో విడత మార్పులను అధికారికంగా ప్రకటించారు. 40కి పైగా నియోజకవర్గాలలో మార్పులు అంటూ హడావుడి చేసిన జగన్ చివరకు 27 మందిని మాత్రమే మారుస్తు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరుగుబాటు భయంతో నిలువెల్లా వణికిన ముఖ్యమంత్రి చిట్ట చివరకు ఎలాగైతేనేం ధైర్యం చేసి మంగళవారం రాత్రి 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సవావేశంలో నియోజకవర్గ ఇన్ చార్జిల పేర్లు ప్రకటించారు. ఆ మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా జోలదరాశిశాంత అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా డాక్టర్ తాలే రాజేష్ లను నియమించారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, పాయకరావు పేట ఎస్పీ నియోజకవర్గానికి కంబాల జోగులు, రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ లను ఇన్ చార్జిలుగా నియమించారు. పీ. గన్నవరం (ఎస్సీ) నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీత, జగ్గం పేట నియోజకవర్గానికి తోట నరసింహం, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావులను నియమించారు.అదే విధంగా రాజమహేంద్రవరం సీటీకి మార్గాని భరత్, రూరల్ కు చెల్లుపోయిన వేణగోపాల కృష్ణమూర్తిలను ఇన్ చార్జిలుగా నియమించారు.
పోలవనం ఎస్టీ నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదరికి బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్ ను ఇన్ చార్జిలుగా నియమించారు. అదే విధంగా ఎమ్మిగనూరు, తిరుపతి, గుంటూరు ఈస్ట్ లకు వరుసగా మాచాని వెంకటేష్, భూమన అభినయ్ రెడ్డి, షేక్ నూరి ఫాతిలాలను ఇన్ చార్జిలుగా నియమించారు.
మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను, పెనుగొండకు కేవీ ఉష శ్రీ చరణ్, కళ్యాణదుర్గం కు తలారి రంగయ్యలను ఇన్ చార్జిలుగా నియమించగా, అరకు ఎస్టీ నియోజవకర్గ ఇన్ చార్జిగా గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా మత్స్యరాస విశ్వేశ్వర రాజును నియమించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ కు షేక్ ఆసీఫ్ ను ఇన్ చార్జిగా నియమించారు.