కాళేశ్వరం అవినీతిపై కిషన్ రెడ్డి గాభరా ఎందుకు?
posted on Jan 3, 2024 8:35AM
కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే తమను వ్యతిరేకించేవారిని వేధించడానికి మాత్రమే అని బీజేపీ భావిస్తోందన్న విమర్శలు చాలా ఏళ్లుగా దేశంలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలలో వాస్తవం ఉందా అనిపించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాయలని తాజాగా ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అవినీతిపై బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ విమర్శలు చేశాయి. అయితే బీజేపీ విమర్శలకు కేవలం విమర్శలకే పరిమితం అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే నిబంధనలను తోసి రాజని మరీ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం రుణాలు ఇచ్చింది. ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు తప్పితే.. అన్ని విధాలుగా కాళేశ్వరానికి సహాయ సహకారాలు అందించింది. మళ్లీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిపోయిందని విమర్శలూ గుప్పించింది. కానీ ఏనాడూ కాళేశ్వరం అవినీతిపై విచారణకు పట్టుబట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ విమర్శలకు మాత్రమే పరిమితమైంది. పలు అంశాలలో కేసీఆర్ ను నోటితో విమర్శిస్తూ, చేతలలో సహకారం అందించిన బీజేపీ ఆ పార్టీతో రహస్య మైత్రి కొనసాగించడంతో బీఆర్ఎస్, బీజేపీలు దొందూ దొందే అని జనం నమ్మడంతోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసి మునిగిపోయాయి.
ఇప్పుడు మాత్రం బీజేపీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ డిమాండ్ చేస్తున్నారు.
మరి ఇదే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ డిమాండ్ ఎందుకు చేయలేదు. కాళేశ్వరంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎందరు హస్తినకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అవినీతి బాగోతాన్ని వెలికి తీస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం ఏమిటి అని పరిశీలకులు ఫిర్యాదు చేస్తున్నారు. వారం రోజులలో కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని రేవంత్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం కేంద్రంలో బీజేపీ ఉండగా, జ్యుడీషియల్ ఎంక్వైరీ ఏమిటి? మేం చెప్పినట్లు వినే సీబీఐ ఉందిగా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా లేఖ రాయడం తరువాయి అలా సీబీఐ విచారణ మొదలయ్యేలా చూస్తామని చెబుతున్నారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ముందుకు రాకపోతే.. బీఆర్ఎస్ తో కుమ్మక్కైనట్లేనని అంటున్నారు.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ అంటూ హడావుడి పడుతున్న కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే.. రేవంత్ సర్కార్ కాళేశ్వరం అవినీతి పై విచారణ జరిపించడం ఇష్టం లేనట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరు చెప్పి .. బీఆర్ఎస్ తో రాజకీయం చేసిన బీజేపీ.. ఇప్పుడు కాళేశ్వరం ను కూడా తమ చేతుల్లోకి తెచ్చుకుని అవినీతి బయటకు రాకుండా చేయాలని చూస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కొలువుతీరి నిండా నెల రోజులు కూడా అయ్యిందో లేదో బీజేపీ హడావుడి మొదలెట్టేసింది. కాళేశ్వరం అవినీతిపై ఏళ్ల తరబడి మౌనం వహించిన బీజేపీ.. ఇప్పుడు దానిని వెలికి తీయడానికి ప్రయత్నాలను రేవంత్ సర్కార్ ప్రారంభించగానే గగ్గోలు పెడుతోంది.
బీజేపీ, బీఆర్ఎస్ ల రహస్య మైత్రి ఇకెంత మాత్రం రహస్యం కాదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రేవంత్ పట్టుబట్టడం, మరో వైపు ఎమ్మెల్సీ కవిత హిందుత్వ ఎజెండాను ఎత్తు కోవడం చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారీ అవగాహనతో పని చేయడానికి నిర్ణయించుకున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటకు రాకూడదన్నదే కిషన్ రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.