తెలుగుదేశం గూటికి దాడి!.. రేపు చంద్రబాబుతో భేటీ
posted on Jan 2, 2024 @ 4:57PM
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఒకరు. అయితే ఆ సినియారిటీని కాపాడుకోవడానికి ఎన్నడూ ఆయన ప్రయత్నించలేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కీలకమైన సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2014 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైకాపా గూటికి చేరారు. ఆ ఎన్నికలలో తన కుమారుడు దాడి రత్నాకర్ కు ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన పార్టీ మారారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
సరే దాడి కోరుకున్నట్లే ఆ ఎన్నికలలో ఆయన కుమారుడు రత్నాకర్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఏం లాభం ఆయన పరాజయం పాలయ్యారు. అంతే ఇక వైసీపీలో ఆయనకు కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది. పార్టీలో ఆయనను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ వైసీపీ గూటికే చేరారు. కానీ ఆయనకు కనీసమైన గుర్తింపు పార్టీలో దక్కలేదు. అయితే ఓపిగ్గా ఎదురు చూసిన ఆయన 2014 ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఆ అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వైసీపీకి రాజీనామా చేసేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేసినట్లు ధృవీకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బుధవారం (జనవరి 3)న తండ్రి దాడి వీరభద్రరావుతో కలిసి తాను, కార్యకర్తలు చంద్రబాబు, లోకేష్ తో భేటీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా తెలుగుదేశంలో దాడి వీరభద్రరావు చేరిక పట్ల ఉత్తరాంధ్ర తెలుగుదేశంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి వారితో పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని అంటున్నారు.