వైసీపీ ఊహలు... పిచ్చి పీక్స్!
posted on May 27, 2024 @ 2:43PM
పోలింగ్ జరగడానికి ముందు వైసీపీ ‘వైనాట్ 175’ అని ఊగారుగానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్ల రెస్పాన్స్ చూసి వాళ్ళకు పరిస్థితి అర్థమైపోయింది. అంతకుముందు ‘బుస్’ అన్నవాళ్ళు ఇప్పుడు ‘తుస్’ అని కూడా అనడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాలు, ఉత్తుత్తి బిల్డప్పులు ప్రదర్శిస్తున్నప్పటికీ, వైసీపీ నాయకులు - కార్యకర్తలు అందరి మనసులలో ‘జూన్ 4 తర్వాత నా పరిస్థితి ఏమిటి దేవుడా’ అన్న ఆలోచనే మెదులుతోంది. అయితే మొన్నామధ్య వరకు జగన్ ఈసారి కూడా గెలుస్తాడు అని వేణుస్వామి చెప్పడం చూసి వైసీపీ వర్గాలు నిజమే అనుకున్నాయి. అయితే కేసీఆర్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పాడు. కేసీఆర్ తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. లేటస్ట్.గా ఐపీఎల్‌లో గెలుస్తారని వేణు స్వామి చెప్పిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్.లో దఢేల్‌మనడంతో మరోసారి వైసీపీ వర్గాల గుండెల్లో బాంబులు పేలాయి. మొదట్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పగానే మురిసి ముద్దయిపోయిన ఈ బ్యాచ్, వేణుస్వామి జగన్ గెలుస్తాడని కాకుండా చంద్రబాబు గెలుస్తాడని చెప్పినట్లయితే ఎంత బాగుండేదో అనుకుంటున్నారు. వేణుస్వామి చెప్పిన మాటల మీద నమ్మకం పోయింది గానీ, ఇప్పుడు వైసీపీ నాయకులు తాము గెలవబోతున్నామనే దానికి మరికొన్ని‘ఆధారాలను’ చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. ఆ ‘ఆధారాలు’ ఏమిటో చూస్తే, కొంతమంది వైసీపీ నాయకుల మెంటల్ కండీషన్ ఏ స్థాయిలో వుంది అర్థమవుతుంది.
ఆధారం-1: జూన్ 3వ తేదీ నుంచి దాదాపు పదీ పదిహేను రోజులపాటు వైజాగ్‌లో వున్న హోటళ్ళన్నిటిలోనూ రూమ్స్ మొత్తం బుక్కయిపోయాయి. అంటే అర్థం ఏమిటి.. ఈ ఎన్నికలలో జగన్ గెలవబోతున్నాడు. దాంతో వైజాగ్‌లో రాజధాని హడావిడి మొదలైపోతుంది. పైగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి రూమ్స్ బుక్ అయిపోయాయి. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేకపోతే వైజాగ్‌లో ఈ స్థాయిలో హోటల్ రూమ్స్ ఎందుకు బుక్ అవుతాయి?
ఆధారం-2: సాధారణంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుంటే వర్షాలు కురవవు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నా, జగన్ ముఖ్యమంత్రిగా వున్నా వర్షాలు బాగా కురుస్తాయి. మామూలు మేఘాలు మాత్రమే కాకుండా ‘క్యుములోనింబస్’ మేఘాలు కూడా ఏర్పడుతూ వుంటాయి. జూన్ నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వాళ్ళు చెబుతున్నారు. అంటే, వర్షాలు బాగా కురవబోతున్నాయి కాబట్టి, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.
ఆధారం-3: సాక్షి మీడియా వాళ్ళు ఏపీలో జనం ముందు మైకులు పెట్టి ఎవరు గెలుస్తారు అని అడిగితే, జగనే గెలుస్తాడు అని చెబుతున్నారు. అంటే అర్థమేంటి? జగనే గెలుస్తాడు.
ఆధారం-4: పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు జగన్ తన నివాసంలో రాజశ్యామల యాగం చేయించాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తాడు. ఇవే కాక, ఇలాంటి వింత వింత ఆధారాలను నమ్ముకుని, వైసీపీ వర్గాలు ఊహల్లో బతికేస్తున్నాయి.