విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం.. వెర్రితలలు వేస్తున్న వైసీపీ అతి!
posted on May 27, 2024 @ 2:52PM
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితం వచ్చే నెల 4న వెలువడనుంది. అయితే అంచనాలు, విశ్లేషణలూ అన్ని కూడా ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని తేల్చేస్తున్నాయి. వైసీపీ లీడర్లు, క్యాడర్ లో కూడా ఓటమి కళ కనిపిస్తోంది. వారి భాషలోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ కూడా ఓటమిని అంగీకరించేసిన తీరు వినిపిస్తోంది. కనిపిస్తోంది. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమా పేరుతో చేస్తున్న అతి నవ్వుల పాలౌతోంది.
మంత్రి బొత్స సత్యనారాయణ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ప్రకటించేశారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇంకా ఫలితాలు వెలువడ లేదు.. రాబోయేది వైసీపీ సర్కారే.. జూన్ 4 తరువాత చుక్కలు చూపిస్తాం జాగ్రత్త అంటూ అధికారులకు హెచ్చరికలు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే.. ఫలితాలు మరో 9 రోజుల్లో వెలువడనున్నాయి. కచ్చతమైన అంచనాలకు రావడానికి జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
ఈ తరుణంలో విజయంపై నమ్మకం ఉన్న వారెవరైనా కామ్ గా ఉంటారు. సంచలన ఆరోపణలు, ప్రకటనల జోలికి వెళ్లరు. తెలుగుదేశం కూటమి నేతలు అదే చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెకేషన్ లో ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విదేశీ పర్యటనలో సేదతీరుతున్నారు. జగన్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆక్కడ ఆయన చేస్తున్న అతి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఆయన లోని ఓటమి భయాన్ని కూడా ఎత్తి చూపుతోంది. ఆ విషయం పక్కన పెడితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న కూటమి నేతల మాటల్లో విశ్వాసం కనిపిస్తోంది. వారు ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా మాట్లాడుతున్నారు. పోలింగ్ సరళిని హేతుబద్ధంగా వివరిస్తున్నారు. వారిలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు.
అదే సమయంలో వైసీపీ నేతల్లో మాత్రం గాభరా, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక వైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే మరో వైపు ఈ ఎన్నికల్లో తమకు ఘోర అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు, అధికారయంత్రాంగాం, ఎన్నికల సంఘం అన్నీ తెలుగుదేశంతో కుమ్మక్కైపోయాయని ఆరోపిస్తే ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. అధికారులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామనీ, రాగానే మీ సంగతి చూస్తామంటూ పరోక్షంగా బెదరిస్తున్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార వైసీపీ ఆడమన్నట్లల్లా ఆడింది. అడుగులకు మడుగులొత్తింది. అటువంటి పోలీసు వ్యవస్థ నిజంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చీమ తలకాయంత ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తుందని భావించజాలం. ఇదే పోలీసు వ్యవస్థ గత ఐదేళ్లుగా వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించింది. శుక్రవారం అరెస్టులతో వైసీపీ వ్యతిరేకులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆధారాలు, ఫిర్యాదులతో సంబంధం లేకుండానే కేవలం ఆరోపణలతో అర్ధరాత్రి అరెస్టులకు తెగబడింది. ఇవన్నీ వైసీపీ ఆదేశాల మేరకే చేసిందన్నది బహిరంగ రహస్యం.
మరో పక్క విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ బొత్స హడావుడి చేస్తుంటే కొందరు అతి రాయుళ్లు విశాఖలో హోటల్ రూమ్స్ అధిక ధరలకు ముందుగానే రిజర్వ్ చేసి పారేస్తున్నారు. విపక్ష నేతలకు వ్యతిరేకంగా ఈ ఐదేళ్ల కాలంలో నమోదైన ఏ కేసూ కూడా న్యాయస్థానంలో నిలబడిన దాఖలాలు లేవు. ఇంత అడ్డగోలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు వారి ఆదేశాలకు తలవంచడం లేదంటేనే ఆ పార్టీకి విజయావకాశాలు లేవని మెడమీద తలకాయ ఉన్న ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.
కానీ వైసీపీలో కొందరు నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం కనీసం ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా నిలబడటానికైనా ఎవరైనా మిగలాలి, అప్పటి వరకూ కార్యకర్తలలో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో సూడో ప్రచారానికి తెరలేపారు. అదేమిటంటే వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు విశాఖకు తరలి రానున్నారు. అందుకోసం ఇప్పటికే విశాఖలోని హోటళ్లలో రూములన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి అంటూ అందుకు ఆధారంగా ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తున్నారు. హోటళ్ల రూంల ధరలు పెరిగిపోయాయన్నది వాస్తవం. ఎందుకంటే పండుగలు, పబ్బాల సమయంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచేయడం కద్దు. అదే విధంగా హోటల్ రూం చార్జీలను కూడా పెంచేస్తారు.
ప్రస్తుతం విశాఖ హోటళ్లలో రూమ్ లన్నీ రిజర్వ్ అయిపోయిన మాట వాస్తవం. వాస్తవ రేట్ల కంటే అధికంగా చెల్లించేందుకు అంగీకరిచేసి మరీ వైసీపీ నేతలు హోటల్ రూంలను బుక్ చేసేసుకున్నారు. అయితే వారు చెప్పిన తేదీకి తండోపతండాలుగా విశాఖ రావడానికి బస్సులలో కూడా ముందస్తు రిజర్వేషన్లు ఉండాలి కదా.. కానీ అటువంటి పరిస్థితి ఏదీ లేదు.
మరీ ముఖ్యంగా కడప నుంచి విశాఖకు రోజూ రెండు బస్సులు తిరుగుతాయి. ఆ బస్సుల్లో జగన్ ప్రమాణ స్వీకారం రోజున కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ముందుగా బుక్ కాలేదు. ఇది వాస్తవం. విశాఖ రావడానికి ఎవరూ ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోకుండానే విశాఖ హోటళ్ల రూములన్నీ ఖాళీ లేకుండా ఎలా?
అక్కడికే వస్తున్నాం. హోటళ్లలో రూంలు ముందుగా బుక్ చేసుకుని ఆ తరువాత వాటిని క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. అయితే బస్సుల విషయంలో అలా కాదు. బుక్ చేసుకున్న తరువాత క్యాన్సిల్ చేసుకుంటే చచ్చినట్లు క్యాన్సిలేషన్ చార్జీలు కట్టాల్సిందే. అందుకే వైసీపీ ప్రచారం కోసం హోటళ్లు పెద్ద ఎత్తున బుక్ చేసేసింది. క్యాన్సిల్ చేసేసినా వచ్చే నష్టం ఉం లేదు కనుక. కానీ క్యాన్సిలేషన్ చార్జీలు భరించాల్సి వస్తుంది కనుక బస్సులలో సీట్లు బుక్ చేయలేదు. అదీ సంగతి. లేని హైప్ క్రియేట్ చేసి, నిజంగా అంత సీన్ ఉందని కనీసం క్యాడర్ నైనా నమ్మించాలన్న ప్రయాసతోనే జగన్ ప్రమాణ స్వీకారం రోజున విశాఖలో హోటల్ రూంలు ఖాళీలేకుండా బుక్ అయిపోయాయని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.