కౌంటింగ్ రోజు గలాభాకు వైసీపీ ప్రణాళికలు క్లియర్.. అడ్డుకునుందుకు ఈసీ రెడీ అయ్యిందా?
posted on May 31, 2024 9:17AM
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేందుకు సమయం ఆసన్నమైంది. ఐదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు మే 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు ఓటు ద్వారా చెక్‌పెట్టారు. ఆ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. పోలింగ్ జరిగిన తీరును బట్టి తమ ఓటమి ఖాయమైందని ఇప్పటికే వైసీపీ ఓ అంచనాకు వచ్చింది. పోలింగ్ రోజు బెదిరింపులతో, ఘర్షణలతో ఓటింగ్ శాతం పెరగకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు అర్ధరాత్రి 2గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ద్వంసంతోపాటు, తమకు అనుకూలంగా పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేశారు. అయితే, రాష్ట్రం మొత్తం పరిస్థితిని చూస్తే పోలింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్ కు పోలీసులు, ఎన్నికల అధికారులు కొంతమేర అడ్డుకట్ట వేశారు.
దీంతో ఓటమి ఖాయమని తమ అంతర్గత సర్వేల ద్వారా జగన్ ఆయన వర్గానికి స్పష్టత వచ్చేసింది. కూటమి విజయం ఖాయమైన క్రమంలో.. కూటమి విజయానికి అడ్డుకట్ట వేసేలా వైసీపీ కుట్రలకు తెరలేపింది. ఇందుకోసం రెండు ప్లాన్లను సిద్దం చేసింది. కౌంటింగ్ రోజు కూటమి విజయాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేయడం , అలాకాని పక్షంలో కూటమి అభ్యర్థులు ప్రజా మద్దతుతో కాదు.. ఈసీ సహకారం, దొంగ ఓట్ల ద్వారా గెలిచారంటూ ముద్రవేయడం. ఈ రెండు ప్లాన్లుకూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమలుకాబోతున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఏపీలో పోలింగ్ జరిగిన తీరునుచూస్తే వైసీపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం వైసీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేతలకు కూడా అర్ధం అయిపోయింది. కానీ, వైసీపీ అధిష్టానం, పెద్దలు మాత్రం మనమే గెలుస్తున్నామని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీ నేతలైనా చేస్తారు. అందులో తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, వైసీపీ అధిష్టానం మరో అడుగు ముందు కేసి కౌటింగ్ రోజు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించాలని ప్లాన్ వేసింది. ఆ విషయం పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఈసీ రాష్ట్ర పోలీస్ బలగాలను అప్రమత్తం చేశాయి. వైసీపీ నేతలు కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించటానికి సిద్ధమయ్యారన్న విషయం ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాటల ద్వారా తేటతెల్లమైంది. రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ మనం పాటించాల్సిన పని లేదని, ప్రతి అంశంపై అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా కౌటింగ్ సమయంలో గందరగోళం సృష్టించాలన్న రీతిలో దిశా నిర్దేశం చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. రూల్స్ ఫాలో అయ్యే వారు ఏజెంట్లుగా వెళ్లొద్దు.. గొడవలు చేసే వారే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని సజ్జల చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు 100శాతం అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వారికి కీలక సూచనలు చేసినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కౌంటింగ్ హాల్‌లో ఈవీఎంలు సీల్ తీసే విషయంలో, లెక్కించే విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా పెద్ద రాద్దాంతం చేయాలని సదరు ఏజెంట్లకు చెప్పినట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రాల వద్దకు తాము ఎంపిక చేసిన వైసీపీ నేతలు వస్తారు. వారి వెంట భారీగా కార్యకర్తలను తీసుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంటారు. కౌంటింగ్ హాల్‌లో ఏ చిన్న అవకాశం దొరికినా అభ్యంతరాలు లేవనెత్తండి. గొడవ చేయండి. అవసరమైతే ఈవీఎంలను బద్దలకొట్టేయండి. వెంటనే కౌంటింగ్ హాల్ నుంచి బయటకువచ్చి వైసీపీ నేతలకు సిగ్నల్ ఇవ్వండి.. తరువాత జరగాల్సిన గొడవను వారు చూసుకుంటారు. కొందరు పోలీసులు, అధికారులు మనకు మద్దతుగా ఉంటారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రం వద్ద వీరంగం సృష్టించండి. వీలుపడితే ఈవీఎం బాక్సులను మాయం చేసేందుకు సైతం వెనుకాడొద్దు. అలాంటివారే కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లుగా వెళ్లండి.. అంతా పక్కా ప్లాన్‌తో జరిగిపోవాలి. ఏజెంట్లపై కేసులైనా వారిని కాపాడుకునే బాధ్యతను వైసీపీ అధిష్టానం తీసుకుంటుందని సజ్జల క్లియర్ కట్‌గా చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
సజ్జల వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం రెండు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటిది కౌంటింగ్ కేంద్రంలో ప్రతి చిన్న విషయానికి అభ్యంతరం చెప్పడం ద్వారా గొడవను సృష్టించి కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయడం. అదే సమయంలో వీలుదొరికితే ఈవీఎంలను ద్వంసం చేయడం. రెండోది.. కౌంటింగ్ సమయంలో అభ్యంతరాలు లేవనెత్తి గందరగోళం సృష్టించండం. తద్వారా ప్రజా మద్దతుతో కాదు.. ఈసీ అండదండలతో, దొంగ ఓట్లతో కూటమి అధికారంలోకి వచ్చిందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. కౌంటింగ్ కేంద్రం వద్ద గొడవ మొదలుపెట్టిన వెంటనే దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా, పార్టీ అనుకూల చానెల్స్ సిద్ధంగా ఉంటాయి. కూటమి అభ్యర్థులు వంద శాతం గెలుస్తారని వైసీపీ అధిష్టానం భావిస్తున్న నియోజకవర్గాల్లో ఈ రెండింటిలో ఏదోఒక ప్లాన్ అమలు జరగాలని వైసీపీ తరపున కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనే ఏజెంట్లకు సజ్జల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ను ఎన్నికల సంఘం ఎలా ఎదుర్కొంటుందనేది చర్చనీయాంశంగా మారింది. సజ్జలతోపాటు వైసీపీలోని కీలక నేతలను అరెస్టు చేయడం లేదా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసీ సైతం వైసీపీ కీలక నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కౌంటింగ్ రోజు నేషనల్ మీడియాసైతం ఏపీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.