రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోంది.. జీఏడీ నిర్ణయం సంకేతం అదేగా?
posted on May 31, 2024 @ 10:10AM
మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఓటమి ఛాయలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు అలర్ట్ అవుతున్నారు. ముందు ముందు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ కు ఒక రోజు ముందే మంత్రుల పేషీలను స్వీధీనం చేసేసుకోవడానికి రెడీ అయిపోయారు.
ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే కౌంటింగ్ కు ఒక రోజు ముందే మంత్రుల పేషీలను ప్రభుత్వ పరిపాలనా శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఈ సమాచారాన్ని ఇప్పటికే మంత్రులకు పంపింది. మంత్రుల కార్యాలయ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడమే కా కుండా మంత్రుల పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీళ్లేదని విస్ఫష్టంగా చెప్పింది. అలాగే సచివాలయం నుంచి తమ అనుమతి లేకండా వస్తువులు, దస్త్రాలు, తీసుకువెళ్లడానికి వీళ్లేదని సిబ్బందికి జారీ చేసిన ఆదేశాల్లో విస్పష్టంగా పేర్కొంది.
పోరుగు రాష్ట్రం తెలంగాణలో ఇలా కౌంటింగ్ పూర్తై ఫలితం తెలియగానే అలా మంత్రుల పేషీల నుంచి కీలక ఫైళ్లు మాయం అయిన నేపథ్యంలో ఏపీలో అలా జరగకుండా ప్రభుత్వ సాధారణ పాలనా శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫలితాలకు ముందుగానే మంత్రుల పేషీలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ శాఖ నిర్ణయం తీసుకోవడమే.. అధికార పార్టీ ఓటమి ఖరారైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.