లంచాలు ఇస్తేనే పని జరుగుతోంది! వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..
posted on Oct 4, 2021 @ 1:09PM
ఆంధ్రప్రదేశ్ లో పాలనంతా అడ్డగోలుగా సాగుతుందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అవినీతికి అడ్డాగా ప్రభుత్వ కార్యాలయాలు మారిపోయాయని అంటున్నారు. వైసీపీ నేతలు ప్రతి పనిలో కమీషన్లు అడుగుతుండటంతో.. అధికారులు అడ్డగోలుగా లంచాలు వసూల్ చేస్తున్నారని చెబుతున్నారు. తాము వసూల్ చేసిన లంచాల్లో వాటాలు వైసీపీ నేతలకు ఇస్తున్నామని కొందరు అధికారులు ఓపెన్ గానే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నాఅధికార పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. అంతా పారదర్శకంగానే సాగుతుందని, విపక్ష నేతలు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కౌంటరిస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యేనే పాలనలో అవినీతి జరుగుతుందని బహిరంగంగానే అంగీకరించారు. అంతేకాదు గ్రామాల్లో స్థానిక వైసీపీ నేతలు.. లంచం ఇస్తేనే పనులు చేసి పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపరెడ్డి సొంత మండలంలో ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కోల్పోయింది. కోట పంచాయతీలో ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు లేనిదే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిస్తే డబ్బులు డిమాండ్ చేయమేంటని ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబ పరువు పోయిందని వాపోయారు. సొంత మనుషులు ఇతర పార్టీలోకి, ఇతర వర్గాలకి వెళ్లిపోవడం చాలా బాధాకరమన్నారు. కంచుకోటగా ఏర్పాటు చేసిన తన మండలం, తన ఊరిలో ఇలా తమ ఉనికిని కోల్పోవడం చూస్తే కన్నీళ్లొస్తున్నాయని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.