అన్ని పార్టీల ముఖ్య నేతలు అక్కడే.. హుజూరాబాద్ ఎవరిది?
posted on Oct 4, 2021 @ 12:47PM
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంచుమించుగా నాలుగు నెలలకు పైగానే రాష్ట్ర రాజకీయాలలో నలుగుతోంది. రాజకీయం, పరిపాలన మొత్తం హుజూరాబాద్ సెంట్రిక్ గానే సాగుతోంది. అయినా ఆ నాలుగు నెలల కథ వేరు ..ఇప్పుడు నడుస్తున్నకథ వేరు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ఘట్టం నడుస్తోంది. పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్హ్ది మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటినుంచో ప్రచారం సాగిస్తున్నా, ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది. తెరాస
అందరికంటే ముందే గెల్లు శ్రీనివాస్ పేరు ప్రకటించింది, గెల్లు నామినేషన్ కూడా కానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, రెండు రోజుల కింద విధ్త్ర్ది నాయకుడు బల్మూరి వెంకట్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇంతవరకు కొంత స్తబ్దుగా ఉన్న కాంగ్రీస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది
పాదయాత్ర ముగించుకుని, ప్రచారబరిలో దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పైకి ఏకంగా రామబాణం సంధించారు. బీజేపే అభ్యర్ధి ఈటల రాజేందర్’తో కలిసి ప్రచారంలో పాల్గొన్న బండి, కరెన్సీ నోటుకు.. కమలం గుర్తుకు మధ్య జరిగే పోటీలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను దాదాపుగా చుట్టి వచ్చారు. ఆయన భార్య జమున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల బృందాన్ని ఏర్పాటుచేసింది.ఇందులో,మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, బొడిగె శోభలాంటి కొందరు నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో టీం రంగంలోకి దిగుతుందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. సందర్భాన్ని బట్టి కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి లీడర్లు కూడా ప్రచారంలో పాల్గొంటారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ కూడా ఉంటుందని అంటున్నారు.
ఇక తెరాస విషయానికి వస్తే, హుజూరాబాద్ ఉపఎన్నిక భారం మొత్తం మంత్రి హరీష్ రావు ఒక్కరే మోస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్, మంత్రి గంగుల, ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇంకా ఇతర నాయకులు ఎందరున్నా భారం మాత్రం హరీష్ పైనేఉంది, కత్తి కూడా హరీష్ మెడ మీదనే వెళ్ళాడుతోంది. తెరాస అభ్యర్ధి గెల్లు ఓడితే, హరీష్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు. అందుకే కావచ్చును, మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్లోనే తిష్ట వేశారు. హుజూరాబాద్పక్కనే ఉన్న సింగాపూర్ క్యాంపు ఆఫీస్ కేంద్రంగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ముఖ్య నాయకులతో మీటింగ్ లు పెడుతూనే అభ్యర్థితో అన్ని మండలాల్లో తిరుగుతున్నారు. ధూం ధాం కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్లోఈ రోజూ మార్నింగ్ వాక్ చేపడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
షెడ్యూల్ కు ముందు పది, పదిహేను రోజులపాటు కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర వర్గాలతో సమావేశాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు.. కోడ్ ఎఫెక్ట్తో ప్రస్తుతం రూట్ మార్చారు. మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ .. స్థానికంగా ఉన్న లీడర్లు, ముఖ్య కార్యకర్తలతో రోజూ భేటీ అవుతున్నారు. ఊర్లలో తాజా పరిస్థితులపై ఆరా తీస్తూ ప్రజల మూడ్ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కుల, మహిళా సంఘాల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ లీడర్లే చెప్తున్నారు. ప్రచారం ముగిసి ఒకటీ రెండు రోజుల
ముందు సీఎం కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని వారు అంటున్నారు.అలాగే, మంత్రి కేటీఆర్ కూడా ఒకటి రండు రోజులు ప్రచారంలో పాల్గొంటారని అంటున్నారు. అయితే, ఎద్నుకనో గానీ, స్టార్ ప్రచారకులుగా 20 మంది పేర్లు ప్రకటించిన తెరాస, ఆ స్టార్ల జట్టులో కవిత పేరు చేర్చలేదు. అది వేరే విషయమే అయినా కవిత పేరు ఎందుకు చేర్చలేదు అనే విషయంలో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండుమూడు రోజుల కింద బల్మూరి వెంకట్ ను తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే జోష్ పెరుగుతోంది. 2018 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ 60 వేలకు పైగా ఓట్లు సాధించింది. ప్రస్తుతం తెరాసలో ఉన్న పది కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అభ్యర్ధితో సంబంధం లేకుండాను కాంగ్రెస్ పార్టీకి నియోజక వర్గంలో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉందని పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నియామకంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. సీనియర్లు కూడా ప్రచారానికి రానుండడం ఆ పార్టీకి కొంత ప్లస్ అని చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార బరిలో దిగితే, ఇక ఆ తర్వాత కథ ఎలా ఉంటుందో ఉహించుకోవలసిందే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆలస్యంగా బరిలో దిగినా రేవంత్ రెడ్డి, “ఎప్పుడు వచ్చామన్నది కాదు, బులెట్ దిగిందా లేదా” అన్నట్లు అన్న దూకుడు ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశలన్నీ రేవంత్ రెడ్డి పైనే పెట్టుకున్నాయి.
నియోజకవర్గంపై కొంత పట్టు ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పీసీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ చేస్తారని, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. పార్టీ అభ్యర్థి వెంకట్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్లు ప్రచారానికి వస్తారని అంటున్నారు. అయితే. ఈసారి ఎన్నికలపై పార్టీల ప్రచారం పెద్దగా పనిచేయదని అంటున్నారు. ఈటలకు అటూ ఇటూ అన్నట్లుగా హుజూరాబాద్ ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ... ఎదో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే తప్ప ప్రజల నిర్ణయం మారదని అంటున్నారు.