రంకెలు.. పెడబొబ్బలు.. ఎవర్ని బెదిరిద్దామని?
posted on Jun 1, 2024 @ 2:34PM
ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఔను పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ రేపు అనేది లేదనుకుంటున్నారా? మీలో ఒక్కర్నీ వదలం తస్మాత్ జాగ్రత్త అంటూ నిన్నమొన్నటి వరకూ తమ అడుగులకు మడుగులొత్తిన అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్నారు.
నిజమే.. నిన్నటి దాకా నేరుగా ఎవరి మౌఖికాదేశాలపై అయితే పోలీసులు పని చేశారో.. ఆయనపై ఇప్పుడు అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఔను మామూలుగా అయితే సజ్జలపై క్రిమినల్ కేసు అదీ తాడేపల్లి పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యిందంటే.. అర్ధం ఏమిటి? వైసీపీ హవా ఎత్తిపోయిందనే కాదా? ఎన్నికల ఫలితాలు వెలువడగానే జగన్ మాజీ అయిపోబోతున్నారనే కాదా? అయినా ఆ విషయం పేర్ని నాని లాంటి వారికి ఎందుకు అర్ధం కావడం లేదు? ఒక వేళ అర్ధమైనా చివరి క్షణం వరకూ తమ దబాయింపు సెక్షన్ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలని భావిస్తున్నారా? తాడేపల్లి పోలీసు స్టేషన్ లో సజ్జలపై క్రిమినల్ కేసు, అలాగే వైసీపీకి అందునా ఆ పార్టీ అధినేత జగన్ కు కంచుకోట లాంటి కడపలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు నగర బహిష్కరణ..దీంతోనే ఇప్పటి దాకా ఏమో ఫలితం ఎలా ఉంటుందో అని ఊగిసలాడుతున్న వారికి కూడా వైసీపీ భవిష్యత్ ఏమిటో అర్ధమైపోయింది. దీంతో రేపు కౌంటింగ్ లో గలాటా చేసే వాళ్లే ఏజెంట్లుగా కూర్చోవాలి అన్న హుంకరింపుల నుంచి అసలు కౌంటింగ్ సెంటర్ లో కూర్చోడానికి ఏజెంట్ దొరికితే చాలన్న పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఏజెంట్లు దొరికినా వారు ఎటూ ఓటమే కదా ఇంతోటి దాని కోసం వాదనలు, గొడవలు ఎందుకు అని ప్రేక్షకపాత్రకే పరిమితమౌతారన్న అనుమానం వైసీపీ నేతలను వేధిస్తోంది. అందుకే అధికారులపై హెచ్చరికలు, బెదరింపులకు పాల్పడటం ద్వారా రాబోయేది మన ప్రభుత్వమే అన్న భరోసా అంతో ఇంతో పార్టీ కేడర్ లో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చు.
ఇక అధికారులు, పోలీసుల తీరు ఒక్క సారిగా ఇలా మారిపోవడానికి వారికి గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా 70ఎంఎం స్క్రీన్ మీద కనిపించడమే అంటున్నారు. ఫలితం ఎలా రాబోతోందో స్పష్టంగా తెలిసిపోయిన నేపథ్యంలో చివరి రోజులలోనైనా నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తే రాబోయే ప్రభుత్వ గుడ్ లుక్స్ లో పడతామన్న ఆశతోనే అధికారులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజుల హింసాకాండకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ఏ మాత్రం ఉపేక్షించమన్న స్పష్టమైన హెచ్చరికలు పోలీసుల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే విజయంపై నమ్మకాన్ని వదిలేసుకున్న వైసీపీ నేతలు ఆ ఫ్రస్ట్రేషన్ లో అధికారులను బెదరించి మరింత అభాసుపాలౌతున్నారు.