బాధ్యతాయుత ప్రజానాయకుడు చంద్రబాబు!
posted on Jun 1, 2024 @ 2:59PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు. బాధితులను పరామర్శించలేదు. అసలు విజయవాడ నడిబొడ్డులో డయేరియా విజృంభించి అమాయకుల ఉసురు తీస్తోందన్న విషయం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతిలో అడుగుపెట్టీపెట్టగానే బెజవాడ డయేరియా బాధితులపై స్పందించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
ఇంతెందుకు పోలింగ్ పూర్తయిన తరువాత ఆయన ప్రతిక్షణం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అధికారులకు, ఎన్నికల సంఘానికీ లేఖలు రాశారు. ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.