జగన్ కు తలవొంచని ధీరులు ఏబీ, ఆర్ఆర్ఆర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు. అయితే ఇద్దరూ కూడా ఎక్కడా తలవొంచలేదు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎటువంటి అండా లేకుండా ఒంటరిగానే అలుపెరుగని పోరాటం సాగించారు. వారిద్దరిలో ఒకరు  శుక్రవారం(మే31) సగౌరవంగా రిటైరైన డీజీపీ స్ధాయి పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. మరొకరు ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు! ఇరువురూ కూడా జగన్ బాధితులే. ఇరువురూ కూడా ఒంటరిగానే న్యాయపోరాటం, రాజకీయ పోరాటం సాగించారు. ఇరువురూ కూడా అంతిమంగా విజయం సాధించారు. నైతికంగా కూడా ఉన్నతంగా నిలిచారు. అదే స్థాయిలో అశేష ప్రజాభిమానానికీ పాత్రులయ్యారు. 

ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు విషయం తీసుకుంటే.. 2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మొత్తం అధికార వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి ఆయన టార్గెట్ గా మారారు. పెగాసన్ పరికరాల కొనుగోలులో అవినీతి వంకతో ఆయనను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు సస్పెన్షన్ చెల్లదని విస్పష్ట తీర్పు ఇచ్చినా సస్పెన్షన్ ఎత్తివేసినట్లే ఎత్తివేసి మళ్లీ అదే కేసులో ఆయనను సస్పెండ్ చేశారు. క్యాట్ ఉత్తర్వ్యులనూ ఖాతరు చేయకుండా ఆయనను సస్పెన్షన్ లోనే ఉండగానే పదవీ విరమణ చేసే పరిస్థితి తీసుకురావడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటానికి తలవంచక తప్పలేదు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చితీరాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. దీంతో ఆయన సగౌరవంగా రిటర్ అయ్యారు. ఏబీ విషయంలో ప్రభుత్వ తీరు ఎంత దుర్మార్గంగా ఉందో ప్రపంచం మొత్తానికి అర్ధమైంది. సామాన్య ప్రజలు కూడా ఆయన ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నారు. 

ఇక రఘురామకృష్ణం రాజు విషయానికి వస్తే.. అధికార పార్టీ ఎంపీగా ఆయన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడమే నేరమైంది. ఠాఠ్ నేను చేసింది తప్పంటావా? అన్న ఆగ్రహంతో జగన్ ఆయనపై కక్ష కట్టారు.  అక్రమ కేసులు బనాయించి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయినా ఆయన ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ పేరిట జగన్ సర్కార్ నిర్వాకాలను ఉతికి ఆరేశారు. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఆయన పోరాట స్ఫూర్తికి జనం మద్దతు లభించింది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు జనం ఆయన విజయం తథ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన అసెంబ్లీ స్పీకర్ అవుతారన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజును జగన్ అధ్యక్షా అని సంభోదిస్తూ చూడాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలా జగన్ టార్గెట్ చేసి వేధించి వేపుకు తిన్న ఇరువురూ కూడా జనాభిమానాన్ని సంపాదించుకున్నారు. జగన్ అధికారాన్ని లెక్క చేయకుండా ఎదిరించి  నైతికంగా ఉన్నతంగా నిలబడ్డారు. ప్రజాభిమానానికి పాత్రులయ్యారు.  

Teluguone gnews banner