వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..
posted on Sep 6, 2021 @ 2:33PM
జగనన్న పాలన ఏపీలో ఏ ఒక్కరికీ నచ్చట్లేదు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీలతో అంతా విసుగెత్తిపోయారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దివాళ అంచుకు చేర్చడం.. అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేయడం.. ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోవడం.. ఇలా అన్నివర్గాల వారూ జగన్‌రెడ్డి సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇసుక, ఖనిజ సంపద దోపిడీ.. కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. జే టాక్స్, మినిస్టర్ ట్యాక్స్, ఎమ్మెల్యే ట్యాక్స్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయడంపై రగిలిపోతున్నారు. ఇక సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి.. పనికిరాని సరుకంతా తాగించేస్తూ.. ధరలు విపరీతంగా పెంచేస్తూ.. ఆ లిక్కర్ ఇన్‌కమ్‌తో వేల కోట్లు అప్పులు చేసేస్తూ.. ఏపీని సర్వనాశనం చేస్తున్న జగనన్న పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇళ్లు ఇస్తానని చెప్పి.. ముంపు భూములు అంటగట్టడంపై లబ్దిదారులే మండిపడుతున్నారు.
ఇలా.. జగన్‌రెడ్డి అడ్డగోలు పాలనపై అన్నివర్గాల ప్రజలతో వైసీపీ నేతలు సైతం అసహనంగా ఉన్నారు. గ్రామాల్లో వైసీపీ నాయకులను పట్టించుకోకపోవడం అధికారమంతా వాలంటీర్ల చేతిలో పెట్టి.. నీలిజెండా మోసిన నాయకులకు మూడుచెరువులా నీళ్లు తాగించడంపై కిందిస్థాయి వైసీపీ కేడర్ అంతా ఆవేశంతో రగిలిపోతున్నారు. రెండేళ్లు ఓపిక పట్టాం.. ఇక మావళ్ల కాదంటూ.. ఫ్యాన్ రెక్కలు విరిచేస్తూ.. అధికారపార్టీని వీడి.. టీడీపీలో చేరిపోతున్నారు. ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు జరుగుతుండటం జగన్‌రెడ్డి పాలనపై ఆ పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనం.
తాజాగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం రాజుపాలెంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పోకడ, నియోజకవర్గంలోని నాయకుల వ్యవహారశైలిపైనా అసంతృప్తిని వెళ్లగక్కారు. ముస్లిం మైనారిటీలు, బలహీనవర్గాలు, అగ్రవర్ణాలలోని కాపు సామాజికవర్గానికి చెందిన వారు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరంతా గత ఎన్నికలలో వైసీపీకి మద్దతుగా ఎమ్మెల్యే రాంబాబు గెలుపుకోసం పనిచేశారు. ఇకపై టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితో పాటు, నియోజకవర్గంలోని ఆపార్టీ నేతల వైఖరిపై వారు విసుగెత్తి వైసీపీని వీడారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోగా.. సంక్షేమ ఫలాలు అందాలంటే అధికారపార్టీలోనే ఉండాలనే భావన ఉన్నా.. ఇలా వందలాది మంది అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటికి చేరడం ఆసక్తికరంగా మారింది. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేఖతకు సాక్షంగా నిలిచింది.