టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రాజకీయ నేతలు? ఈడీ విచారణలో తేలిపోనుందా?
posted on Sep 6, 2021 @ 2:47PM
తెలుగు రాష్ట్రలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన ఈ కేసులో తాజాగా ఈడీ విచారణ జరుపుతోంది. గతంలో తెలంగాణ సిట్ విచారణకు హాజరైన వారందరిని ప్రశ్నిస్తోంది. గతంలో విచారణకు హాజరు కాని అగ్రతారలను ఈడీ ప్రశ్నిస్తుండటం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందని, అందుకే గతంలో కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను బలం చేకూరేలానే ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణ జాబితాలో లేని లేని.. రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు పిలవడం సంచలనంగా మారింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇటీవలే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పెద్దలు డ్రగ్స్ కేసుపై భయపడుతున్నారని.. ఈడీ విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఏంటి ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అసలు డ్రగ్స్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని కామెంట్ చేశారు కేటీఆర్ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనేది తనకు సంబంధం లేదని..డ్రగ్స్ కేసుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గోవాకి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలన్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ ప్రశ్నించడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 3న ఈడీ విచారణకు హాజరయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. నిజానికి సెప్టెంబర్ 6న విచారణకు హజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెప్టెంబర్3న విచారణకు హాజరవుతానని రకుల్.. ఈడీకి మెయిల్ ద్వారా తెలిపింది. దీంతో డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ను ఈడీ విచారించడంతో పీసీసీ చీఫ్ వంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, బండి సంజయ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్ కు అడ్డు వస్తే పగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకులు ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటికి వస్తాయని రాజాసింగ్ చెప్పడం చర్చగా మారింది.
2017లో డ్రగ్స్ కేసు వెలుగులోనికి వచ్చింది. 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ విచారణ జరిపింది. విచారణకు హాజరైన 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరు మాత్రమే తమ రక్త నమూనాలను ఇచ్చారు.దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ మినహా మిగిలిన వారంతా తమ రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రక్త నమూనాలను తీసుకునే విషయంలో సంబంధిత వ్యక్తి అంగీకారం గానీ లేదంటే కోర్టులు అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మిగిలిన వారి నుంచి శాంపిల్స్ తీసుకోకుండా ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వదిలేసింది. ఇద్దరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, వారి రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలినట్లు సమాచారం. మిగిలిన వారు డ్రగ్స్ తీసుకున్నట్లుగానీ లేదా డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం ఉందనే ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసుతో సినీతారలకు సంబంధం లేదని ఎక్సైజ్ శాఖ అప్పట్లోనే తేల్చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును మూడేళ్ల తర్వాత 2020 డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించింది.