సీబీఐపై సుప్రీంకోర్టు సీరియస్.. సీఎం జగన్‌కు ఇక మూడినట్టేనా?
posted on Sep 6, 2021 @ 2:06PM
సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పేరుకే అత్యుత్తమ సంస్థ కానీ.. పనితీరు అధమం అనే విమర్శ ఏళ్లుగా ఉంది. ఇటీవల కాలంలో సీబీఐ దర్యాప్తు మరింత వివాదాస్పదమవుతోంది. కుప్పలకు తెప్పలు కేసులు టేకప్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఏళ్లకు ఏళ్లు కాలం వెళ్లదీస్తుంటుంది. ఇక కోర్టులో ఛార్జిషీట్లు వేయడం.. ఆ కేసు నిలబడేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడంలో అనేక వైఫల్యాలే. దర్యాప్తు వరకూ పక్కాగా చేసినా.. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడో, మరే కారణమో తెలీదు కానీ.. ఆ కేసు శిక్ష పడే వరకూ రాదనే ఆరోపణ బలంగా వినిపిస్తుంటుంది. దశాబ్దాల తరబడి కోర్టుల్లోనే కేసులు నలుగుతుంటాయి. ఆలోగా నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతూనే ఉంటారు. అందుకే, సీబీఐ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తుంటాయి. ఇటీవల మద్రాసు హైకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. పంజరంలో చిలకలా మారిన సీబీఐకి స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. మద్రాసు హైకోర్టు కామెంట్లపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. తాజాగా, సుప్రీంకోర్టు సైతం సీబీఐ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్లు చేయడంతో సీబీఐపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
సీబీఐ కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదంటూ సుప్రీంకోర్టు ఘాటు విమర్శలు చేసింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు చేపట్టారు? ఎన్ని నిరూపించారు? ఎందరికి శిక్ష పడింది? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు కామెంట్లతో సీబీఐ పనితీరుపై మరోసారి చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలపై ఉన్న అక్రమాస్తుల కేసులో సీబీఐ కాలయాపన ఈ కోవకే వస్తుందని అంటున్నారు. అటు, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణలో సైతం తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులో ఏళ్ల క్రితమే ఛార్జిషీట్ నమోదైంది. జగన్ రెండేళ్లు జైల్లో కూడా మగ్గారు. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనకు బెయిల్ రూపంలో స్వేచ్ఛ లభించింది అంటారు. బెయిల్‌పై బయట ఉండే.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠం కొట్టేశారు. సీఎంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో బెయిల్‌రద్దు పిటిషన్ కూడా వేశారు. జగన్ బెయిల్ రద్దు చేయమని కాకుండా.. కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేస్తూ సీబీఐ కౌంటర్ వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా సీబీఐ తీరు ఎల్లప్పుడూ వివాదాస్పదమే.
అటు, వైఎస్ వివేక హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా ఇంకా కేసు కొలిక్కి రాలేదు. రెండు నెలలుగా మాత్రమే సీబీఐ దర్యాప్తులో దూకుడు పెరిగింది. అయితే, అసలు పెద్దలను వదిలేసి.. చిన్న చేపలకు వల విసురుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇలా.. పలు కేసుల్లో జగన్ సర్కారుకు కొమ్ము కాసేలా సీబీఐ వ్యవహరిస్తోందనే విమర్శలను ప్రతిపక్షం పదే పదే చేస్తోంది. తాజాగా, కశ్మీర్‌కు సంబంధించిన ఓ కేసులో స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా సీబీఐ పనితీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది సుప్రీంకోర్టు. కేసులు పెట్టినా శిక్ష పడేలా చేయలేకపోతున్నారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇలా కోర్టుల నుంచి వరుస మొట్టికాయలు పడుతుండటంతో.. ఇక తమ పరిధిలోని కేసులపై సీబీఐ దూకుడు పెంచనుంది. కోర్టుల అక్షింతల నుంచి తప్పించుకోవాలంటే.. పెండింగ్‌లో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులు, బెయిల్ రద్దు కేసు, వైఎస్ వివేకా మర్డర్.. తదితర కేసుల్లో సీరియస్‌గా శిక్షలు పడేలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే..? జగన్‌కు మళ్లీ జైలు తప్పదా? జగన్ దారిలోనే విజయసాయిరెడ్డి కూడా జైలు పక్షి అవుతారా?