దేవుని భూములకు దేవుడే దిక్కా? వైసీపీ నేతల కబ్జాల్లో ఆలయ భూములు..
posted on Oct 6, 2021 @ 3:13PM
రాజుల సొమ్ము రాళ్లపాలు ..ఇది ఒకప్పటి సామెత, కానీ ఇప్పుదు ... దేవుడి సొమ్ము పాలకుల పాలు అనవలసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ విషయమే తీసుకుంటే, ఒక దేవుని దయతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో దేవుని భూములను ఆక్రమించుకునేందుకు అధికారిక అడ్డదారిలో అడుగులు వేస్తోందా? అంటే, అవుననే అనవలసి వస్తోంది.
అధికారంలోకి వస్తూనే వెంకన్న దేవునికే ఎసరు పెట్టిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు, అక్కడా ఇక్కడ అని కాకుండా, ఎక్కడంటే అక్కడ దేవుని మాన్యాలను దిగమింగేందుకు ప్రణాళికాబద్దంగా పావులు కడుపుతోందని,రాజకీయ,మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. పత్రికలలో అయితే, పుంఖాను పుంఖానుగా కధనాలు వెలుగు చూస్తున్నాయి. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం అవేవీ పట్టిచుకోకుండా, పాపులను క్షమించే పరమాత్ముని దీవెనలతో హిందూ దేవాలయాల భూములను ఆక్రమించుకునేందుకు ‘నిరభ్యంతరం’ గా ఎన్వోసీలు జారీ చేస్తోందని అంటున్నారు. ఇందులో కొందరు మంత్రుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, వెలుగు చూసిన ఎన్వోసీ అక్రమాల విషయంలో స్వయంగా రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాజీ ఓఎ్సడీ వివాదంలో చిక్కుకున్నారు. అయినా..తాజాగా గుడివాడలో రెండు ఆలయాలకు చెందిన రూ.250కోట్ల విలువైన భూములపై ఓ మంత్రి కన్నేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రజాప్రయోజనం పేరుతో పలు ప్రాజెక్టుల కోసం ఆలయాల భూములు తీసుకున్న ప్రభుత్వం కూడా వాటికి పరిహారం చెల్లించడం లేదు. ఇక సాగుతో సహా వివిధ అవసరాల కోసం లీజుపై దేవుడి భూములు తీసుకున్న వేలాది మంది కౌలుదారులు గడువు ముగిసినా అక్కడే తిష్టవేసి భూములను వారి గుప్పిట్లోనే ఉంచుకుంటున్నారు. రాష్ట్రంలోని దేవుడి భూములపై భక్తుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశ్వాసాలకు, దేవుడి భూములు అన్యాక్రాంతం అవడానికి, సంబందం ఉందని అనేందుకు అంతగా దారాలు లేవు. గత ప్రభుత్వాల హయాంలలో కూడా దేవుని భూములు తరిగి పోతూనే ఉన్నాయి. దేవుని భూములు అన్యాక్రాంతం అవడం మాత్రమే కాదు, ప్రజా ప్రయోజనాల పేరిట దుర్వినియోగం అవుతూ వచ్చాయి.
అందుకే, ఒకప్పుడు, రాష్ట్రంలోని 23,778 ఆలయాలకు కలిపి మొత్తం 4,09,229 ఎకరాల భూములుంటే కాలక్రమంలో ఈ భూములు వివిధ రూపాల్లో ఆక్రమణకు గురవుతూ,కరుగుతూ వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన 1,51,297 ఎకరాల సాగు భూములు లీజులో ఉన్నాయి.మరో 1,01,027 ఎకరాలను అర్చకులు సాగు చేసుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో సాగుకు అనువుగా లేని భూములు 19,995 ఎకరాలు, ఆలయాలు, సత్రాల పరిధిలో 25,117 ఎకరాలు ఉన్నాయి. కాగా, ప్రజాప్రయోజనాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు 6,429 ఎకరాలను లీజుకు తీసుకోగా, వాటికి పరిహారం మాత్రం చెల్లించడం లేదు. ఇక 87,525 ఎకరాలు పూర్తిగా ఆక్రమణలో ఉండిపోయాయి. గతంలో లీజుకు తీసుకుని గడువు ముగిసినా వాటిని ఆలయాలకు తిరిగి అప్పగించని భూములు 25,117 ఎకరాలున్నట్లు దేవదాయశాఖ గుర్తించింది. ఈ రెండు కేటగిరీలు కలిపి 1,05,364 ఎకరాలు ఆలయాల పరిధిలో లేకుండా అక్రమార్కుల చేతిలో మిగిలిపోయాయి. ఆక్రమణలకు సంబంధించి 3,561 కేసులు దేవదాయశాఖ ట్రైబ్యునల్‌లో విచారణలో ఉన్నాయి.
గత తెలుగు దేశం ప్రభుత్వం దేవుని భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద చూపింది. ఆక్రమణకు గురైన దేవుని భూములను గుర్తించి, అనుమానంగా ఉన్న భూములను కూడా, క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా దేవుడి భూముల జాబితాలో చేర్చారు. అందులో కచ్చితంగా దేవుడి భూములే అని నిర్ధారణ అయిన వాటిని రిజిస్ర్టేషన్ నిషేధిత జాబితాలో చేర్చేప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో మొదలైంది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో ఆలయ భూముల పరిరక్షణ విషయంలో చేతులెత్తేసింది. పరిరక్షణ కష్ట మవుతోందనే సాకుతో విక్రయించి సొమ్ముచేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ విధంగా దేవుడి భూములకు ప్రభుత్వం నుంచే రక్షణ లేకుండా పోయింది. కంచే చేను మేస్తుంటే,అన్నట్లుగా పరిస్థితి దిగజారింది. అందుకే దేవుని భూములకు... ఆ దేవుడే దిక్కు అనుకోవలసి వస్తోంది.