అల్లిపూల వెన్నెల.. ఇప్పుడే ఎందుకమ్మ కవితమ్మ?
posted on Oct 6, 2021 @ 2:32PM
అల్లిపూల వెన్నెల.. తెలంగాణను ఊపేస్తున్న బతుకమ్మ పాట. తెలంగాణ జాగృతి రూపొందించిందీ దృశ్యకావ్యం. పల్లె పాటల పోటుగాడు.. మిట్టపల్లి సురేందర్ అద్భుతంగా పాట రాశారు. అల్లిపూల వెన్నెల.. చేరువలోన కురవగా.. పూల ఇంధ్రధనస్సులే నేల మీద నిలవగా.. కొమ్మలన్నీ అమ్మలై వేలపూలు విరియగా.. అంటూ బతుకమ్మ పాటను అందంగా రాసి పేర్చారు మిట్టపల్లి. ఈ గౌరమ్మ గీతానికి వాల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్.. ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ పాటను, ఆ సంగీతాన్ని.. తన దర్శకత్వ పటిమతో అందంగా చిత్రీకరించారు పాపులర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఇంతటి ప్రముఖుల కలయికతో రిలీజైన అల్లిపూల వెన్నెల.. బతుకమ్మ పాట అంతే హిట్ అవుతోంది. ఒక్కరోజులోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా నిలుస్తోంది.
అంతా బాగుంది. పాట ఇంకా బాగుంది. వ్యూస్ మరింత బాగున్నాయి. ఏ.ఆర్.రెహమాన్, గౌతమ్ మీనన్, మిట్టపల్లి సురేందర్.. ఇలా హేమాహేమీలతో ఇంత ప్రెస్టీజియస్‌గా బతుకమ్మ సాంగ్‌ను రూపొందించాల్సిన అవసరం తెలంగాణ జాగృతి సమితికి ఎందుకొచ్చిందనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. జాగృతి అధినేత్రి, కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో, ఆమె చేతుల మీదుగా ఈ బతుకమ్మ పాట రిలీజ్ కావడం వెనుక వేరే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కల్వకుంట్ల కవిత. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమె గ్రాఫ్ బాగా పడిపోయింది. సెలబ్రిటీ స్టేటస్ ఒక్కసారిగా మాయమైంది. చాలాకాలం రాజకీయంగా కనుమరుగు అయ్యారు. తండ్రి సహకారంతో ఈ మధ్యనే ఎమ్మెల్సీ అయ్యారు. అయినా, మునుపటి చొరవ, దూకుడు కవితలో కనిపించడం లేదు. పైగా ఇటీవల జరిగిన ఓ పరిణామం మరింత ఊహాగానాలకు తావిస్తోంది. ఏటేటా తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టే కవితి.. ఈసారి మాత్రం అన్నకు రాఖీ కట్టకపోవడం.. జస్ట్ ట్విటర్‌లో బ్రదర్‌కు రాఖీ విషెష్ చెప్పడం కలకలం రేపింది. అన్నకు చెల్లికి మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. కేసీఆర్‌తోనూ కవిత పెద్దగా టచ్‌లో లేకపోవడం.. ప్రగతి భవన్‌లో అడుగుపెట్టకపోవడంతో.. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏదో జరుగుతోందనే గుసగుసలు బయటకు వస్తున్నాయి. సీఎం కేసీఆర్.. కేటీఆర్, సంతోష్‌కుమార్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. తనను అసలే మాత్రం పట్టించుకోవడం లేదని కవితమ్మ అలకబూనిందని అన్నారు. వారి మధ్య ఏవో ఆస్థి గొడవలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. కారణం ఏదైనా.. కవిత ప్రగతిభవన్‌కు దూరంగా ఉంటున్నారనేది మాత్రం వాస్తం.
సరిగ్గా ఇలాంటి సమయంలో.. సడెన్‌గా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలా ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పాటను రిలీజ్ చేయడం కాకతాళీయమా? వ్యూహాత్మకమా? అనే అనుమానం. ఇప్పుడేమీ జాగృతి సంస్థకు గోల్డెన్ జ్యూబ్లీ, ప్లాటినమ్ జ్యూబ్లీ లాంటి మైలురాయి ఏడాది కాదు. ఈసారి బతుకమ్మకు వేరే ప్రత్యేకతలు కూడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్లుగా తెలంగాణ జాగృతి.. పెద్దగా యాక్టివ్‌గా కూడా లేదు. అలాంటిది ఇప్పుడే.. ఇలా.. ఏ.ఆర్.రెహమాన్, గౌతమ్ మీనన్‌లాంటి ప్రముఖులతో ఇంతటి ప్రత్యేక గీతాన్ని రూపొందించాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్న.
తండ్రితో, అన్నతో.. దూరం పెరిగినందున.. వారికి తానేమీ తక్కువ కాదనేలా.. వారికి ఏమాత్రం తీసిపోననే రేంజ్‌లో మళ్లీ తెలంగాణ జాగృతిని కవిత యాక్టివ్ చేస్తున్నారని అంటున్నారు. ప్రెస్టీజియస్ సాంగ్‌తో.. జాగృతికి పునర్‌వైభవం తీసుకొచ్చేలా.. మళ్లీ సాంస్కృతికంగా, రాజకీయంగా సొంతంగా పైపైకి ఎదిగేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే, సడెన్‌గా ఇలాంటి సాంగ్ తీసుకొచ్చి.. తెలంగాణ వ్యాప్తంగా హల్‌చల్ చేయాలనేది కవిత వ్యూహంలా కనబడుతోందని అంటున్నారు.