మనీ పవర్ ఇన్ పాలిటిక్స్.. పొలిటీషియన్స్ మాటల్లోనే
posted on Dec 31, 2019 @ 11:24AM
ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు లేకుండా రాజకీయం చేయలేమనే స్థాయికి దిగజారిపోయింది నేటి రాజకీయం. ఒకప్పుడు నాయకులు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చేవారు. ప్రజలు కూడా తమకి మంచి చేసేవారికి, తమ బ్రతుకులు మార్చేవారికి ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాసేవ చేయాలని ఉన్నా డబ్బుల్లేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కొందరు నాయకులు. ఇక కొందరు పరిస్థితుల్ని బట్టి మనం కూడా మారిపోవాలని చెప్పి.. చుట్టూ మందిని తిప్పుకోవడానికి, ఓట్లు కొనడానికి.. కోట్ల డబ్బులు వెనకేసుకుంటున్నారు. అంతోఇంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఉన్న వ్యాపారాలు, ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజాసేవని గాలికి వదిలేస్తున్నారు. మొత్తానికి డబ్బు అనేది నేటి రాజకీయాలను శాసిస్తోంది. డబ్బు చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో డబ్బు పాత్ర గురించి మనకంటే.. రాజకీయ ప్రముఖులకు, మేధావులకు బాగా తెలుస్తుంది. త్వరలో వారి మాటల్లోనే దీని గురించి తెలుసుకోవచ్చు.
జనవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' వేదికగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్’ సదస్సు జరగనుంది. ఇందులో ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎన్నికల కమిషనర్ అశోక్ లావస, జస్టిస్ చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, బీజేపీ నేత రాంమాధవ్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు.