కాంట్రాక్టర్‌కు వైసీపీ లీడర్ వార్నింగ్.. వైరల్‌గా మారిన వీడియో..
posted on Sep 5, 2021 @ 8:56PM
ఏపీలో అరాచక పాలన. వైసీపీ నేతల ఆగడాలు. ప్రకృతి వనరుల దోపిడీ. ప్రశ్నిస్తే దాడులు. నిలదీస్తే కేసులు. ఇసుక నుంచి ఖనిజాల వరకూ దేన్నీ వదలకుండా తవ్వేసుకుంటున్నారు. ఇక టెండర్లు, కాంట్రాక్టు పనులన్నీ అధికార పార్టీ నేతలకే. వారిని కాదని ఎవరైనా న్యాయబద్దంగా పనులు దక్కించుకుంటే.. వెంటనే స్థానిక ఎమ్మెల్యేను వెళ్లి కలవాల్సిందే. ఆయన అడిగినంత ముట్టజెప్పాల్సిందే. కాదూ కూడదు.. కాంట్రాక్టు చేపడితే ఎమ్మెల్యేకు డబ్బులెందుకు ఇవ్వాలి? ఇదెక్కడి న్యాయం? ఇలా అనుకుంటే ఇక అంతే సంగతి. ఇక ఆ కాంట్రాక్టరుకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. పనులు ముందుకు జరగకుండా అడ్డుకుంటారు. బెదిరిస్తారు. దాడులకు తెగబడతారు. ఇలా ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు అన్నీఇన్నీ కావు. తాజాగా, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తరఫున ఆయన సన్నిహితుడైన మరో వైసీపీ నేత జయరామరెడ్డి ఓ గుత్తేదారును బెదిరించిన వైనం కలకలం రేపుతోంది. వైరల్‌గా మారిన ఆ వీడియో రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలను వీడియో సాక్షంగా నిలుస్తోంది.
ఎమ్మెల్యే కాపు మనిషి.. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ మామూలుగా లేదు. పనులు ఆపేస్తారా.. దాడి చేయమంటారా? మావాళ్లను రమ్మంటారా? గాలి తీసేస్తాం.. అద్దాలు పగలగొడతాం.. ఏం తమాషాగా ఉందా.. ఫోన్ చేస్తే మాట్లాడరా? ఎమ్మెల్యేను కలవమంటే కలవరా? పనులెలా చేస్తారో చూస్తాం? ఇలా ఆ గుత్తేదారుకు ఎమ్మెల్యే తరఫున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వైసీపీ నేత జయరామరెడ్డి.
రాయదుర్గం-కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్‌ను గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని గుత్తేదారుపై మాటలతో దాడికి దిగారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు చేపట్టింది. అయితే, స్థానిక ఎమ్మెల్యేను అడగకుండా పనులు చేపట్టడమేంటని వైసీపీ నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు మరో నిదర్శనంగా మారింది.