సెంటిమెంట్స్ తో జగన్ చెలగాటం.. ఆందోళనలో వైసేపీ లీడర్స్
posted on Sep 6, 2021 @ 10:49AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను ఎవరు ప్రశ్నించరు, కానీ, పరిపాలనలో ఆయన తమ మత విశ్వాసాలు, విద్వేషాలను చొప్పిస్తే, ఎవరైనా ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. ఎవరి మతం పట్ల వారికి విశ్వాసం ఉండడం తప్పుకాదు, కానీ, ఇతర మతాల పట్ల విద్వేషం, వివక్ష చూపడం తప్పు కాదు, నేరం.అదే జరిగితే, ప్రభువులు ప్రజాగ్రహాన్ని, ధర్మాగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్’లో జరుగుతున్నది అదే. నిజమే, కరోనా ఉదృతి కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో, సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత మేరకు తగ్గిచుకోవడం అవసరమే. అయితే, వినాయకుడికి ఒక రూలు ఏసు ప్రభువుకు మరో రూలు అంటేనే పేచీ వస్తుంది. అందుకే, వినాయక చవితి వేడుకలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన ఆంక్షలు వివాదాస్పద మయ్యాయి.
ప్రతి ఆదివారం చర్చిలలో జరిగే ప్రార్ధనా కార్యక్రమలో వందల మంది పాల్గొన్నా కరోనా రాదు, సినిమా హాల్స్ లోకి కరోనా కాలు పెట్టదు, ఊరూరా, వాడవాడన జయంతులు,వర్ధంతుల పేరిట జాతరలు చేసినా, కరోనా కన్నెత్తి చూడదు, కానీ, వినాయకుడి పూజ జరిగితే మాత్రం కరోనా ఊరుకోదు.కళ్ళురుముతుంది, కాటేస్తుంది, అంటే, అది ప్రభుత్వ పక్షపాత ధోరణికి అడ్డం పడుతుంది. అందుకే, వినాయకుడు గడప దాటటానికి వీల్లేదు, ఎవరి ఇంట్లో వారే వినాయక చవితి జరుపుకోవాలనే జగన్ రెడ్డి పవిత్ర ఫత్వా పట్ల హిందూ సమాజం ఆగ్రహం వ్యక్త పరుస్తోంది.
నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆది నుంచి మత వివక్ష ఆరోపణలు ఎదుర్కుంటోంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు, వందకు పైగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహల ద్వసం, రథ దహనాలు వంటి అకృత్యాలు అనేక జరిగాయి. మరో వంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు, గ్రామాలకు గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చివేసే గ్రామ క్రైస్తవీకరణ పవిత్ర క్రతువు, ప్రభుత్వ నిధులతో చర్చిల నిర్మాణం, పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇవ్వడం వంటి చర్యలతో జగన్ రెడ్డి ప్రభుత్వం శిలువను మెడలో వేసుకుందన్న సందేహాలకు తావిస్తోంది. ఈ నేపధ్యంలోనే, జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ ఆచారాలను, సంప్రదాయాలను ధ్వంసం చేయాలని చూస్తోందని, హిందూ సమాజం, స్వామీజీలు చేస్తున్న ఆరోపణలు, బీజేపీ, ఇతర హిందూ ధార్మిక, సంఘ్ పరివార్ సంస్థలు చేస్తున్న ఆందోళనులకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది.
మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలు, సామూహిక నిమజ్జనాలు జరుపుకోవద్దంటూ ప్రభుత్వం ఆదేశించడం దుర్మార్గమని బీజేపీ విమర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. తాజాగా, కర్నూలులో నిర్వహించిన ఆ పార్టీ రాయలసీమ ముఖ్య నేతల సమవేశంలో రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పండుగకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
నిజానికి ఒక్క బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాదు, అధికార వైసీపీ నాయకులు కూడా జగన్ రెడ్డ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరి మత విశ్వాసాల పట్ల వారికి గౌరవం, అభిమాన ఉండడం సహజం, కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన సాగిన్చాలనికోవడం, మరొకరిపై తమ విశ్వాసాలను రుద్దాలనుకోవడం, రాజ్యాంగ విరుద్ధం. లౌకికవాద స్పూర్తికి వ్యతిరేకం. అంతే కాదు, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ధోరణి రాజకీయంగానూ పార్టీకి నష్టం తెచ్చి పెడుతుందని వైసీపే నాయకులు కూడా ఆందోళన చేడుతున్నారు. అందుకే, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలను తమ గడప వరకే పరిమితం చేసుకుంటే మంచిదని అంటున్నారు వైసీపీ నేతలు.