ఫెక్సీలతో బెదరించి మహా పాదయాత్రను అడ్డుకోలేరు!

మూడు రాజధానులు వద్దే వద్దు అమరావతే ముద్దు అంటూ అమరావతి రైతుల చారిత్రక పోరాటానికి ఏపీలో అధికార వైసీపీ వినా అన్ని వర్గాలు, పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. తమ పోరాటంలో భాగంగా  రైతులు  అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రకు    గ్రామగ్రామాన జనం సంఘీభావం ప్రకటిస్తూ పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు.

 రైతుల మహాపాదయాత్ర శుక్ర‌వారం (సెప్టెంబర్23) రైతులు గుడివాడ నియోజ‌వ‌ర్గం స‌రిహ‌ద్దుల్లోని రెడ్డిపాలెం చేరుకుంది. అయితే  కంట్లో  నలుసులా,  పంటి కింద రాయిలా అక్కడ అధికార వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేసింది. పాదయాత్రపై విషం చిమ్మే యత్నం చేసింది.  అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులను బెదరించి భయభ్రాంతులకు గురి చేసే లక్ష్యంతో వైసీపీ రైడ్డిపాలెం యువదళం పేరిట వెలిసిన ఈ బ్యానర్ల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ‘మేము ఎవ‌రి జోలికి వెళ్ళం.. మా జోలికి వ‌స్తే ఎగ‌రేసి న‌రుకుతాం..’ అంటూ రాత్రికి రాత్రు వెలిసిన బ్యానర్లు రైతుల పాదయాత్రలో అలజడి,ఉద్రిక్తత రెచ్చగొట్టేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనం మద్దతుతో శాంతియుతంగా సాగుతున్న యాత్రలో అలజడి సృష్టించి శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలన్న దురుద్దేశంతోనే వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని స్థానికులే ఆరోపిస్తున్నారు.  

రెడ్డిపాలెం సెంట‌ర్ నుంచి గుడి వాడ నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లే దారిలో వెలసిన ఈ బ్యానర్లు రైతుల మహాపాదయాత్రను అడ్డుకునే దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారని అంటున్నారు. మూడు రాజధానులంటూ రాష్ట్రంలోని ప్రజల అభీష్టానికీ, ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జగన్ ఆదేశాలతోనే వైసీపీ నేతలు ఇలా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారనీ, ఊరంతా ఒకదారితై ఉలిపి కట్టెలా జగన్ తీరు ఉన్నదని రైతులు అంటున్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అవాంతరాలు కల్పించిన తమ మహాపాదయాత్ర శాంతియుతంగా అరసవల్లి వరకూ సాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనీ, అదే విధంగా బెదరింపు  ఫ్లెక్సీలతో తమ మహాపాదయాత్రను అడ్డుకోలేరనీ రైతులు స్పష్టం చేస్తున్నారు.

 

Advertising
Advertising