Read more!

మౌన‌మేలనమ్మా.. ల‌క్ష్మీపార్వ‌తీ!

పేరు పెట్ట‌డం కంటే పేరు మార్చ‌డం మ‌హా సులువు. ఒక పెద్ద సంస్థ‌కు ఒక పేరు చాలాకాలం జ‌నాల్లో నానిన త‌ర్వాత ఒక వ్య‌క్తికి న‌చ్చ‌క‌నో, మరేకార‌ణం చేత‌నో మార్చేస్తారు. అప్ప‌టిదాకా ఉన్న పేరు వ‌దిలేయ డం ఎలా, మ‌ర్చిపోవ‌డం దుర్ల‌భం క‌దా అని అంద‌రూ ప్ర‌శ్నించిన‌పుడు అస‌లా పేరున్న వ్య‌క్తికి స‌మీపంగా మెలిగిన‌వారు మౌనం వ‌హించడం ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అవున‌నో, కాద‌నో, వాళ్లిష్ట‌మ‌నో అనాలి. కానీ మాటే రాని మౌనాన్ని ఆశ్రయించడం ఏ రకంగా చూసినా సబబు కాదు. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సి టీ పేరు జ‌గ‌న్ స‌ర్కార్ మార్చేసింది. దీన్ని గురించిన వివ‌ర‌ణా అసంబ‌ద్ధంగానూ ఉంది. రాష్ట్ర ప్ర‌జ లే గాక‌, యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని చీద‌రించారు. ఎన్టీఆర్ అభిమానులు.. అన్ని రంగాల‌వారూ తీవ్రంగా స్పందించారు. కానీ ఎన్టీఆర్ ధ‌ర్మ‌ప‌త్ని ల‌క్ష్మీపార్వ‌తి మాత్రం మౌనం వ‌హించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తక్షణమే స్పందించాల్సిన లక్ష్మీ పార్వతి పెదవి విప్పడం లేదు. ఆమె స్పందన తెలుసుకునేందుకు తెలుగువన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పలు మార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు.  

తెలుగు భాష‌, రాష్ట్రం అన‌గానే మొద‌ట‌గా అంద‌రికీ స్ఫురించే పేరు ఎన్టీఆర్‌... అంటూ చాలాకాలం క్రితమే భారీ ఉప‌న్యాసాలు దంచారు ల‌క్ష్మీపార్వ‌తి. ఆయ‌న్ను మించిన న‌టుడు, రాజ‌కీయ‌వేత్త లోకంలో ఎవ రూ లేరని ఆకాశానికి ఎత్తారు. ఎన్టీఆర్ సతీమణిగానే కాక ఆమెకు వీరాభిమానిగా కూడా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు లక్ష్మీ పార్వతి.  కాలక్ర‌మంలో ప‌రిస్థితులు మారి ఆమె ఎన్టీఆర్ కుటుంబానికి దూర‌మ‌యినప్ప‌టికీ ఎన్టీఆర్ పేరు , చ‌రిత్ర గురించి ఎవ‌రు ప్ర‌స్తావించినా ఆమె భాష‌ణ త‌ప్ప‌కుండా విన‌ప‌డేంత‌గా అంద‌రి దృష్టిలో నిలిచారు.

అస‌లు టీడీపీ నాశ‌న‌మ‌యింది చంద్ర‌బాబు వ‌ల్లేన‌ని, ఎన్టీఆర్ అమాయ‌క‌త్వంతో బాబుని చేర‌దీయ‌డంతో బాబు పార్టీ ప‌రిస్థితి దిగ‌జార్చార‌ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. టీడీపీకి అలా దూర‌మై జ‌గ‌న్ నెల‌కొల్పిన వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న గౌర‌వ ప‌ద‌వితో స‌మాదరించారు. అంతే అది మొదలు   రాజ‌కీయాల నేప‌థ్యంలో వైసీపీని నెత్తిన పెట్టుకుని జ‌గ‌న్ ను ఆకాశానికి ఎత్తారు. అయితే ఎన్టీఆర్ విష‌యంలో మాత్రం ఎన్న‌డూ ఆమె ఎవ‌రినీ ప‌ల్లెత్తు మాట వ్య‌తి రేకంగా అన‌నీయ‌లేదు. ఎక్క‌డ‌, ఎవ‌రి మాట విన్నా స్పందించి విరుచుకుప‌డేవారు. 

అలాంటిది తాజాగా పెను వివాదానికి కారణమైన  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో మాత్రం ఆమె మౌనాన్ని ఆశ్రయించారు.  వైసీపీ నీడ‌లో ఉన్నందువ‌ల్ల ఈ వ్య‌వ‌హారంపై కామెంట్ చేస్తే పార్టీలో తన స్థానానికి ముప్పు వస్తుందని జంకతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా అయినా లక్ష్మీ పార్వతి స్పందించపోవడం ఏమిటని అన్ని వర్గాల వారూ విస్తుపోతున్నారు.  పలువురు వైసీపీ నేతలే హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరికాదన్న అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మీ పార్వతి మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు.