గోదావరి జిల్లాల్లో గాలాడక ఫ్యాన్ కు ఉక్కపోత!
posted on Mar 1, 2024 @ 2:20PM
ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ పార్టీకి గాలి ఆడక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. వచ్చే ఎన్నికలలో ఇక్కడ కనీసం ఖాతా తెరవగలమా అన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న నమ్మకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ ఉంది. ఇప్పటి వరకూ అలాగే జరిగింది కూడా. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 స్థానాలలో, తూర్పుగోదావరిలో 19 స్థానాలకు గానూ 14 స్థానాలలో వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది.
అయితే ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆ పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషించడమే కాదు, స్వయంగా వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. అసలు గత ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం అధిరోహించిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఆరంభమైంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక సంఖ్యాకంగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అధికారంలోకి రాగానే జగన్ కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని చెప్పడంతో కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దానికి తోడు ఆయన పాలనా తీరు కూడా ఆ ఆగ్రహాన్ని మరింత పెంచేదిగానే ఉంది. సామాన్య ప్రజలలో జగన్ పాలన పట్ల అసంతృప్తి ప్రజా వ్యతిరేకతగా మారితే.. జిల్లాలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం ఆసంతృప్తికి తోడు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీకి ఈ సారి మద్దతు ఇచ్చేది లేదని కంకణం కట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఇంతటి వ్యతిరేకతకు తోడు పార్టీలో అంతర్గత పోరు వైసీపీ పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తోంది. తొలుత వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ కు పక్కలో బల్లెంగా మారారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అసంబద్ధ విధానాలను రచ్చబండలో ఎండగడుతూ వస్తున్నారు. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వైరం పార్టీకి మరింత చేటు తీసుకువచ్చేలా మారింది. అలాగే అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాథ మధ్య యుద్ధం తార స్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితిని తెలుగుదేశం, జనసేన కూటమి క్యాష్ చేసుకుంది. గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూటమివైపు తిప్పేందుకు పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఈ జిల్లాల్లో వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేనలు పని చేస్తున్నాయి. అందులో భాగంగానే జనసేనాని పవన్ కల్యాణ్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పవన్ ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల నేతలతో పలు మార్లు భేటీ అయ్యారు. నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారు. ప్రజలలో వైసీపీపై తీవ్ర అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో ఈ జిల్లాల్లో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.