సజ్జలపై క్రిమినల్ కేసు
posted on May 31, 2024 @ 10:35AM
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్ల తో సమావేశం సందర్భంగా ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ”మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా చేయాలి. రూల్స్ ప్రకారం వెళ్లే వాళ్లు మనకు అవసరం లేదు. ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసే వాళ్లే కావాలి అంటూ సజ్జల ఆ సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా మాట్లాడటం కౌంటింగ్ కేంద్రాల్లో గలాభా సృష్టించాల్సిందిగా కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టడమే అవుతుందనీ, రూల్స్ పాటించక్కర్లేదు అంటూ మాట్లాడిన సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందనడానికి ఇది తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ సరళిని గమనించిన తరువాత అధికారులు, పోలీసుల తీరులో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్నారు. గతంలో వైసీపీ ఫిర్యాదుల మేరకు మాత్రమే స్పందించే పోలీసులు పోలింగ్ తరువాత తెలుగుదేశం ఫిర్యాదులపై స్పందించడం గమనార్హం.