అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు.. పోలీసుల అదుపులో పిటిషనర్!!
posted on Sep 14, 2020 @ 5:50PM
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని గనుల శాఖను ఆదేశించింది. అయితే, మంగళవారం హైకోర్టులో అక్రమ మైనింగ్ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో.. పిటిషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
కోటనెమలిపురి, కుబాద్పురం గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమంగా వైట్ లైమ్‌స్టోన్ తవ్వకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలైన కోటనెమలిపురికి చెందిన పప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ కార్యకర్తల తరఫున హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గత నెల 26న విచారణ జరపగా.. పూర్తి నివేదిక తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
మంగళవారం హైకోర్టులో ఈ అక్రమ మైనింగ్ కేసు విచారిస్తారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. రామయ్యను ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సెటిల్‌మెంట్ కి రావాలని రెండు రోజులుగా అధికార పార్టీ రామయ్యపై ఒత్తిడి పెంచుతోందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.