షాకింగ్.. 25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్
posted on Sep 14, 2020 @ 3:58PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులందరూ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. భారీ సంఖ్యలో ఎంపీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఉభయసభలకు చెందిన 25 మంది ఎంపీలు ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలిసింది. ఇందులో 17 మంది లోక్‌సభ ఎంపీలు కాగా.. మిగిలిన వారు రాజ్యసభ సభ్యులుగా గుర్తించారు.
కరోనా బారిన పడిన 17 మంది లోక్‌సభ ఎంపీలలో 12 మంది బీజేపీ సభ్యులు కాగా.. ఇద్దరు వైసీపీ, శివసేన, ఆర్ఎల్‌పీ, డీఎంకేకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్న విషయం తెలిసిందే. ఇక, 8 మంది రాజ్యసభ ఎంపీలలో.. ఇద్దరు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ కాగా.. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, ఆప్, తతృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా లోక్‌సభ, రాజ్యసభలను వేరు వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, 7 గంటల వరకు జరగనుంది. కొత్త సభ్యులు అజిత్ కుమార్, పూలో దేవి నీతమ్‌ల చేత చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.