మాట తప్పిన మీరంతా రాజీనామా చేయండి.. వైసీపీకి రఘురామరాజు ఝలక్
posted on Sep 14, 2020 @ 5:50PM
వైసిపి పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరో సారి అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం జగన్ తన పార్టీ ఎంపీలు అందరికీ ఒక సమావేశం ద్వారా మార్గనిర్దేశం చేశారు. అయితే.. రఘురామ రాజుకి మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు. వైసిపి ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందని ఉదయం 9 గంటలకు ఏపీ భవన్ నుంచి అందరికి ఆహ్వానం అందింది. అయితే అంతలోనే 11:10 గంటలకు రఘురామరాజుకు ఫోన్ చేసి పార్టీకి మీకు ఎటువంటి సంబంధం లేదు.. మీరు సమావేశానికి రావొద్దని చెప్పారు. తాజాగా దీనిపై రఘురామరాజు స్పందిస్తూ.. "నన్ను వైకాపా నుంచి బహిష్కరించారనే భావిస్తున్నాను. అయితే దీనిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అయితే నన్ను బహిష్కరించినప్పటికీ నేను పార్టీ జారీ చేసే విప్ ను మాత్రం పాటిస్తాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. మీడియాలో కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి దీనిపై మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి" అని మీడియాకు తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అయన ‘‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. అయితే నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే ప్రజలు బటన్ నొక్కారు. అది అటు ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇపుడు వెనకడుగు వేసి రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు. కాబట్టి మీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. నా ముఖం మాత్రం అక్కడే ఉంది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నేను నెగ్గాను. అమరావతిపై అపుడు ప్రతిపక్షంలో ఉండి ఇపుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు కాబట్టి.. ఒకవేళ రాజీనామా అంటూ చేయాల్సి వస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. నేను చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎప్పటికి పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పారు కాబట్టి.. మీరు రాజీనామా చేసుకోండి. నేను మాత్రం రాజీనామా చేయను’’ అని రఘురామకృష్ణం రాజు ఖరాఖండిగా తేల్చి చెప్పారు.