అంబటి.. అహంకారమా? అవివేకమా?

Publish Date:Dec 22, 2025

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?

Publish Date:Dec 22, 2025

చాలా మంది అనుకుంటున్న‌ట్టు.. కేసీఆర్   ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి ఆరోగ్యం కారణం కాదట... ఆయన అరోగ్యం శారీర‌క‌మైన‌ది కాదు,  ఆర్ధిక‌ప‌ర‌మైన‌ది, బయటకు తెలియని రాజకీయపరమైనది అనంటున్నారు.   తెలంగాణలో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న‌ ఒక శ‌తృవును ఢీ కొట్టాలంటే.. మ‌రో ఇద్ద‌రు మితృలుగా కలవాలి అన్న భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  రేవంత్ దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని  మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ ముందుకెళ్తున్నారు. దీంతో ఇటు మోడీకి, అటు కేసీఆర్ కి ఒక ర‌క‌మైన మితృత్వం అవ‌స‌ర‌మైంది. ఎలాగైనా స‌రే ఇక్క‌డ పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ఏకకాలంలో ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరికీ సమప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గేమ్ అడుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్ కి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదేమంత ఫలితం ఇచ్చినట్లు కనబడదు.  నెక్స్ట్ స్టెప్ లో.. కేసీఆర్ అండ్ కో    లోక్ స‌భ‌లో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తామ‌ని  మోడీకి మాటిచ్చారంటున్నారు. అన్నట్లుగానే  కేసీఆర్ తాను జీరో  అయ్యి మరీ బీజేపీకి 8 ఎంపీ  సీట్ల‌తో ఒక ఊపు ఉత్సాహం కలిగించేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో సహకరించారంటారు పరిశీలకులు. అయినా స‌రే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం  క‌నిక‌రించ‌కుండా కేసీఆర్ లాంటి మ‌ద‌గ‌జాన్ని సంపూర్ణంగా  గుప్పెట్లో పెట్టుకోవాల‌న్న యోచనతో   క‌వితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందు కూడా సై అన్న కేసీఆర్.. ఆ తరువాత బీజేపీతో అసలు డీల్ స్టార్ట్ చేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  సరే సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందం టున్నారు విశ్లేషకులు.   గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు. ఇంతకీ మోడీ పాలసీ ఎంటంటారా?.. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల అగ్రనాయకులను తొలుత కేసులతో భయపెట్టి, ఆ తరువాత   కమలం శరణ్యం అనేలా దారికి తెచ్చుకోవడం. కేసీఆర్ విషయంలోనూ మోడీ అదే పాలసీని అవలంబించి ఉంటారని అంటున్నారు.   ఈ నేపథ్యంలోనే ఇటీవల  రేవంత్ చేసిన కామెంట్ ను కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఫార్ములా వన్ రేస్ కేసులో  కేటీఆర్ విచార‌ణ‌కు,  కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో కేసీఆర్, హ‌రీష్ ల అరెస్టుకు ఈడీ, సీబీఐకి అనుమ‌తులివ్వ‌డంలో కేంద్రం ఆమోదయోగ్యం కాని జాప్యం చేస్తున్నదని రేవంత్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. సరే ఆ తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి.   కాళేశ్వరం వ్యవహారంలో ఇంకా ఎటువంటి కదలికా రాలేదన్నది తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన సుదీర్ఘ అజ్ణాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించడం చూస్తుంటూ.. కేంద్రంలో ఆయన ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఆదివారం (డిసెంబర్ 21) మీడియా సమావేశంలో విమర్శలు గుప్పిస్తూనే మోడీ గారు అని సంబోధించడాన్ని వారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. గతంలో మోడీయా, బోడీయా అన్న కేసీఆర్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా మోడీగారూ అంటూ విమర్శించడమే ఏదో ఒప్పందం జరిగే ఉంటుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

గణితంతో గమ్మత్తులు చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు..!

Publish Date:Dec 22, 2025

గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.  చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది.  కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి,  శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు.   ఈ సందర్బంగానే  ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జాతీయ గణిత దినోత్సవాన్ని  భారత ప్రభుత్వం డిసెంబర్ 2011లో అధికారికంగా ప్రారంభించింది.  రామానుజన్ గణిత  విభాగానికి చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది . మరుసటి సంవత్సరం 2012 దేశవ్యాప్తంగా జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు, గణిత అభ్యాసం,  పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు వేసుకోవడం,  ప్రోత్సాహం అందించడం, కృషి చేయడం.. అలాగే గణిత శాస్త్రానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఆయా వ్యక్తులను గౌరవించడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 22.. డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం. ఆయన కృషి వందేళ్లు గడిచిన  తర్వాత కూడా నేటి మోడరన్  గణితాన్ని ప్రభావితం చేస్తోంది. గణితంలో ఆయన చేసిన పరిష్కారాలు,  సమస్యలు,  ప్రపంచం మీద ఆయన ప్రభావం మొదలైనవి గుర్తించడానికి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఇది ఆయనకు  నివాళిగా మాత్రమే కాకుండా, విద్యార్థులు,  పరిశోధకులు గణితాన్ని ఆవిష్కరించడం,  సాంకేతికత,  శాస్త్రీయ విచారణకు కేంద్రంగా గణితాన్ని  ప్రోత్సహించడానికి ఒక మంచి వేదిక అవుతుంది. సుధీర్ఘ ప్రయాణం.. భారతదేశానికి, గణిత శాస్త్రానికి  అనుబంధం ఆధునిక చరిత్రది కాదు..  అనేక శతాబ్దాల ముందే ఈ అనుబంధం ఉంది. భారతదేశం గణిత శాస్త్రానికి చేసిన కృషిని క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1800 వరకు గుర్తించవచ్చు. అంకగణితం, బీజగణితం,  త్రికోణమితిలో గణనీయమైన పరిణామాలతో పాటు.. దశాంశ సంఖ్యా వ్యవస్థ, సున్నా,  ప్రతికూల సంఖ్యలను  వాడటం వంటి ప్రాథమిక భావనలు భారతదేశంలో పుట్టాయి.   దాదాపు నాల్గవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న భారతీయ గణిత శాస్త్రంలోని క్లాసికల్,  స్వర్ణ యుగాలలో ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త,  భాస్కర II వంటి పండితుల నుండి ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఇంత సుధీర్ఘమైన బారత గణిత చరిత్రలో  శ్రీనివాస రామానుజ్ కూడా ప్రముఖుడు అని చెప్పడానికి ఆయన జయంతి రోజున గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామానుజ్ వారసత్వం.. గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి,   భిన్నాలలో రామానుజన్ తన మార్గదర్శకులకు ఎప్పుడూ  గుర్తుండిపోతారు. నాటి కాలంలో ఆయనకు అధికారం, శిక్షణ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ   స్వతంత్రంగా దాదాపు 3,900 ఫలితాలను సంకలనం చేశాడు. వాటిలో చాలా వరకు  తరువాత కాలంలో  అసలైనవని,  చాలా  లోతైనవిగా నిరూపించబడ్డాయి.  ఆయన విధానం, పద్దతులు ఇరవయ్యవ శతాబ్దపు గణిత శాస్త్రంలోని కీలక రంగాలను పునర్నిర్మించాయి.  ఇరవై ఒకటవ శతాబ్దంలో పరిశోధనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.                                   *రూపశ్రీ.  
[

Health

]

అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

Publish Date:Dec 22, 2025

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...