హత్య కేసులో టిడిపి ఎమ్మెల్యే యరపతినేని అరెస్ట్
posted on Jan 9, 2013 @ 1:36PM
కాంగ్రెస్ కార్యకర్త హత్యకేసులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం యరపతినేని శ్రీనివాసరావును పిడుగురాళ్ల న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
యరపతినేని శ్రీనివాస రావు డిసెంబర్ 19వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ముమ్మరంగా యత్నించారు. ఇందులోభాగంగా నరసరావుపేట కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో 7వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 9వ తేదీ బుధవారం విచారణకు రానుంది.
హత్యకు గురైన ఉన్నం నరేంద్ర తొలుత తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రియల్ ఎస్టేట్ వివాదాలు, క్రికెట్ బెట్టింగ్‌ల నేపథ్యం కలిగిన నరేంద్ర నవంబర్ 27వ తేదీన హత్యకు గురయ్యారు. తన అన్నను హత్య చేసేందుకు ఎమ్మెల్యే యరపతినేని కుట్ర పన్నారని నరేంద్ర సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను మూడో నిందితుడిగా చేర్చారు.