ధర్మానా! ఇది నీకు ధర్మమేనా?
posted on Jan 8, 2013 @ 8:43PM
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మన గౌరవనీయ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారు, ఆయనగారి పుత్రరత్నం రామ్ మనోహర్ నాయుడు కధ వింటే ఆ సామెత వారిరువురి కోసమే పుట్టిందా అని అనిపించకమానదు.
సిబిఐ చార్జ్ షీట్లో మన మంత్రివర్యులపేరు ఎక్కడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, తన కార్యాలయం వైపు తొంగి చూడకుండానే, నెలనెలా టంచనుగా జీత భత్యాలు మాత్రం ఏంతో హుందాగా స్వీకరిస్తూ, కోర్టులచుట్టూ మంత్రిగారు తిరుగుతుంటే, మరో వైపు సదరు మంత్రివర్యుల గారి పుత్రరత్నం, తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో పులిపట్టి గ్రామ పరిధిలోగిరిజనుల సాగు చేసుకొంటున్న సర్వ్ నం.289లో ఉన్నకన్నెధార అనే కొండ ప్రాంతం మీద మనసు పడ్డాడు. అంతే, ప్రభుత్వం ఆఘమేఘాలమీద కదిలి అతనికి చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కన్నెధార ప్రాంతాన్ని క్వారీ మైనింగ్ కోసం ధారాదత్తం చేసేసింది.
ప్రజల అభ్యంతరాలు, గిరిజనుల ఆక్రందనలు ఏవీ కూడా వారి చెవులకి గానీ, ప్రభుత్వ చెవులకు గానీ ఎక్కలేదు. స్థానికుల అభ్యంతరాలు పట్టించుకోకుండా క్వారింగుకి ఏర్పాట్లు చేస్తున్నమంత్రిగారి పుత్రరత్నంగారి కంపెనీపై విచారించి అడ్డుకోవలసిన జిల్లా కలెక్టర్ సౌరవ్ గౌర్ ఆయనకే అనుకూలంగా నివేదిక ఇచ్చి అభాసుపాలయేరు. ఆయన నివేదికతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినందున, క్వారీ లీజుపై అభ్యంతరాలు తెలియజేస్తూ దాఖలయిన పిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరిస్తూ, కలక్టర్ గారినే స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వమని ఆదేశించింది.
ఇక, ఈ కధ ఈవిదంగా నడుస్తుంటే, మరో వైపు మంత్రిగారి పుత్రరత్నం గారికి చెందిన కొందరు వ్యక్తులు (స్థానికులు వారిని గూండాలు అంటున్నారు) కన్నెధార కొండ మీద గిరిజనులు తరతరాలుగా పూజలుచేసుకొంటున్న సీతారాములవారి ఆలయంలో విగ్రహాలను ద్వంసం చేసి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఆ గిరిజనులు కొత్త విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటే మళ్ళీ ఇటీవలే మరోసారి కొందరు ‘వ్యక్తులు’ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్నిబయట పడేసి, హుండీ పగులగొట్టి డబ్బులు కాజేసినట్లు మరోవార్త వచ్చింది. ప్రస్తుతం అమాయకులయిన గిరిజనులు తమ గోడు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక బాధపడతున్నారు. యధా తండ్రీ! తదా పుత్రా! అనుకోవాలేమో మరి!