తమ్మినేని తట్టాబుట్టా సర్దేసుకోవలసిందేనా?
posted on May 22, 2024 @ 9:38AM
తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆయన విద్యార్హతలకు సంబంధించి వివాదం కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయ్యింది. ఇక ఆయన సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో కూడా జనం ఆయన తీరు పట్ల వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి ఆ స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక ఆముదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని ఏ మాత్రం పట్టించుకోలేదని అక్కడి జనం గట్టిగా చెబుతున్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంపై ఆ ఆగ్రహం, ఆ అసంతృప్తే ఎన్నికలలో ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తీరు, పొగరు, అహంభావం ఆయన ప్రకటనలలో ప్రతిఫలించేది. ఇదే ఆయనకు పూడ్చకోలేని నష్టాన్ని చేకూర్చింది. ఆముదాల వలసలో తమ్మినేని ఓటమి ఖాయమని తెలుగుదేశం శ్రేణులు ధీమాగా ఉంటే.. పరిశీలకులు సైతం తమ్మినేని ఆగ్రహం, అనుచిత భాష, అహంభావం ఆయనను ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు.
ఇక సమస్యల పరిష్కారం విషయంలో తమ్మినేని ఆముదాలవలసను అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్డు ఏది అంటే ఎవరైనా ఆముదాలవలస, శ్రీకాకుళం హైవే అని ఠక్కున చెప్పేస్తారు. ఆ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఎన్ని విజ్ణప్తులు వచ్చినా తమ్మినేని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారిపోయినా తమ్మినేని పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మినేనికి ఓటు వేయకూడదని నిర్ణయించేసుకున్నారు. ఇక ఆముదాలవలసలో చక్కెరకర్మాగారం వాగ్దానం కూడా నీటిమూటగానే మిగిలిపోయింది.
వీటన్నిటికీ తోడు ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నాలుగు గ్రూపులుగా చీలిపోయింది. వైసీసీ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలోనే నియోజకవర్గ ప్రజలలో తమ్మినేని పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని తేలింది. అలాగే నియోజకవర్గంలో అధికారపార్టీ అవినీతి పెచ్చరిల్లిందని కూడా ఆ సర్వే పేర్కొంది. అయినప్పటికీ జగన్ తమ్మినేనికే మరో సారి ఆముదాల వలస టికెట్ కేటాయించారు. ఎన్నికలకు ముందే తమ్మినేని ఓటమి ఖరారైపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ మాత్రమే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా స్పీకర్ తమ్మినేని ఓటమిని ఖాయం చేసేశాయి. గత ఎన్నికలలో తమ్మినేని విజయం కోసం సర్వం తానై పని చేసిన వైసీపీ నేత సువ్వారి గాంధీ.. ఇప్పుడు తమ్మినేనికే కాకుండా ఆయన కారణంగా వైసీపీకి కూడా దూరమయ్యారు. దీంతో ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కూన రవికుమార్ విజయం నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు.