వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకంపై ఈసీ సీరియస్
posted on May 22, 2024 9:06AM
పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడడం లేదని అనుకున్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత వైసీపీ నేతల అరాచకం అంతాఇంతా కాదు. పోలింగ్ సజావుగా జరగకుండా ఉండేందుకు వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయితే పైకి మాత్రం తమకేమీ తెలియదనీ, తాము సుద్దపూసలమనీ, కూటమి నేతలే ఈసీతో కుమ్మక్కై అధి కారులను మార్చుకొని ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకున్నారంటూ నాటకాలాడారు. ఆడుతున్నారు.
కానీ పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో వైసీపీ గూండాలు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఓటర్లను బెదిరించడం, దాడులు చేయడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం వరకూ చేయగలిగినదంతా చేశారు. పోలింగ్ తరువాత కత్తులు, రాడ్లతో టీడీపీ నేతలపై దాడులు చేశారు. స్ట్రాంగ్ రూంల వద్దకు కూటమి నేతలు రాకుండా దాడులకు దిగారు. ఇప్పుడు వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీడియోలతో సహా పోలింగ్ రోజు వైసీపీ నేతలు సృష్టించిన బీభత్సం బయటకు వస్తుండటంతో ప్రజలు వారిని చీదరించుకుంటున్నారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయులు తెలుగుదేశం నేతలపై దాడులు చేశారు. ముఖ్యంగా కారంపూడిలో కర్రలు, రాడ్లతో చెలరేగిపోయారు. తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానిక తెలుగుదేశం నాయకుడి కారును, కొన్ని టూ వీలర్లను తగులబెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయారు. వీరికి పలువురు పోలీసు అధికారులు అండగా నిలవడంతో వారి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్లను వైసీపీ నేతలు బెదిరించారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో తెలుగుదేశం తరపున పోలింగ్ ఏజెంట్ లేకుండా చేశారు. పిన్నెల్లిది మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామం. ఆ గ్రామంలో తెలుగుదేశం ఏజెంట్‌గా దళితవర్గానికి చెందిన నోముల మాణిక్యం కూర్చుంటే వైసీపీ నేతలు మాణిక్యం ఇంటిని చుట్టుముట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు రాకపోతే చంపేస్తామని వీడియో కాల్‌లో బెదిరించారు. అదే విధంగా నియోజకవర్గంలోని కేపీగూడెం పోలింగ్ బూత్‌లో కూడా ఇదే విధంగా పైశాచికత్వాన్ని వైసీపీ గూండాలు ప్రదర్శించారు. పోలింగ్ రోజు వైసీపీ నేతల అరాచకాలకు అద్దంపడుతూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డే ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన వీడియో వైరల్ అయింది.
మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లారు. పోలింగ్ బూత్ లోని సిబ్బందిని బెదిరిస్తూ ఈవీఎంను ద్వంసం చేశాగడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ దృశ్యాలు వెబ్ క్యామ్ లో రికార్డయ్యాయి. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఎన్నికల సిబ్బంది సైతం ఈ ఘటనను చూసీచూడనట్లు వదిలేశారు. ఏపీలో పోలింగ్, ఆ తరువాత జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ బృందం మాచర్ల నియోజకవర్గంలోనూ పర్యటించి ఘర్షణలు జరిగిన పోలింగ్ కేంద్రాలు, గ్రామాలను సందర్శించి వివరాలను సేకరించింది. సిట్ దర్యాప్తుతో వైసీపీ అరాచకాల్లో కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈవీఎంలను ద్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించడంతో.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు ఈసీకి తెలియజేశారు.
ఏపీ వ్యాప్తంగా పోలింగ్ రోజు, ఆ తరువాత వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కావాలనే ఘర్షణలకుదిగి ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. సిట్ బృందం ఈసీకి అందించిన తమ నివేదికలో వైసీపీ నేతలు అరాచకాలను పొందుపర్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ సజావుగా జరగకుండా దాడులు చేసిన వైసీపీ నేతలు.. ఆ దాడులు విధ్వంసాలకు తెలుగుదేశం నేతలే కారణమని ఎదురు ఆరోపణలు చేశారు. ఆలస్యంగానైనా వైసీపీ అరాచకాలకు సంబంధించిన వీడియో ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంటూ వచ్చారు. పోలింగ్ రోజు భారీ ఎత్తున ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. భారీగా పోలింగ్ నమోదైతే వైసీపీ ఓటమికి కారణమవుతుందని భావించిన ఆ పార్టీ అభ్యర్థులు, నేతలు పోలింగ్ సజావుగా జరగకుండా ఉండేందుకు దాడులకు తెగబడ్డారు. దీంతో పోలింగ్ రోజు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే, తాజాగా సిట్ బృందం ఈసీకి అందించిన నివేదికలో వైసీపీ నేతల అరాచకాలను పొందుపర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న అంశం వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది. మరోవైపు కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులకు పాల్పడవచ్చునన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో.. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.