పిన్నెల్లి విధ్వంసం చూసిన తరువాతా ఈసీ కళ్లు తెరవదా?
posted on May 22, 2024 @ 10:33AM
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ అమలు చేసిన నియోజకవర్గాలలో పిన్నెల్లి పోటీ చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై పోలింగ్ ముగిసిన పది రోజులకు గానీ, అదీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ నివేదిక తరువాత మాత్రమే ఆయనపై కేసు బుక్కైంది. చర్యలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలపై పోలీసులు ఎలా ముందుకు కదులుతారో చూడాలి. హౌస్ అరెస్టు నుంచి సునాయాసంగా పరారైపోయిన పిన్నెళ్లి.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియసేసినా పోలీసులు ఆయనను తిరిగి తీసుకువచ్చి హౌస్ అరెస్టులో ఉంచే దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.
మాచర్లలో పోలీసులు, అధికారయంత్రాంగం అంతగా పిన్నెల్లితో అంటకాగి విధ్వంసం ద్వారా ఓటింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేసినా.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. నియోజకవర్గంలో ఆయన ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారో ఇట్టే అర్ధం అవుతుంది.
అయినా పోలింగ్ బూత్ లోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఈసీ ఇప్పటి వరకూ చర్య ఎందుకు తీసుకోలేదో అర్ధం కాదు. వాస్తవానికి ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తమ వైఫల్యానికి సిగ్గుపడి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి.
ఇక్కడ ఈసీ వైఫల్యాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచీ కూడా విపక్ష కూటమి నేతలు ఏపీలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ తక్షణ చర్యలు తీసుకోకుండా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఇన్ చార్జి డీజీపీని బదిలీ చేసి ఈసీ సాధించింది శూన్యమని పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనతో తేలిపోయింది.
ఇప్పటికీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసిన సీఎస్పై చర్యలే లేవు. పోలింగ్ రోజున భారీ హింస ఒకెత్తయితే.. కౌంటింగ్ రోజు అంతకు మించి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపునకు, అదనపు బలగాల మోహరింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ ను మార్చకుండా భద్రతా ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండదని, కొత్త డీజీపీ వచ్చిన తరువాత కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో ఈసీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.