రాఖీలు కట్టి నిరసన.. సీఎం జగన్‌కు మహిళా ఉద్యోగుల డెడ్‌లైన్..
posted on Aug 23, 2021 @ 11:36AM
రాఖీలు ఎవరైనా ప్రేమతో కడతారు.. అభిమానం కడతారు.. ఆప్యాయతతో కడతారు.. అదేంటి.. ఆ మహిళలు జగనన్నకు అలా నిరసన తెలుపుతూ రాఖీలు కట్టారేంటి! ఇదే ఇప్పుడు ఏపీలో చర్చణీయాంశమైంది. రాఖీ పండగ సందర్భంగా ఏపీ మహిళా ప్రభుత్వ ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటాలకు రాఖీలు కట్టి నిరసన తెలిపారు. పనిలో పనిగా ఓ డెడ్‌లైన్ పెట్టి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్న అన్నే.. డిమాండ్లు డిమాండ్లే అన్నట్టు.. పండగ పూట ఏపీ వ్యాప్తంగా మహిళా ఎంప్లాయిస్ చేసిన నిరసన కార్యక్రమం జగనన్న పరువును బజారు పాలు చేసింది. మహిళలతో కన్నీళ్లు పెట్టించిన ఏ ముఖ్యమంత్రీ బాగుపడినట్టు చరిత్రలోనే లేదంటూ సీఎం జగన్‌కు అల్టిమేటం జారీ చేశారు.
సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న మహిళా ఉద్యోగులు రాఖీ నాడు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌రెడ్డి చిత్రపటాలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటాలకే కాకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, జిల్లా కలెక్టర్లకు సైతం రాఖీలు కట్టి నిరసన తెలిపారు.
ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం ఉద్యమ కార్యాచరణలో ప్రకటించిన ‘రక్షాబంధన్ - మహిళా పోరుబాట’ కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘జగనన్నా.. పెన్షన్ రక్ష కల్పించన్నా’ అంటూ మహిళా ఉద్యోగులు నినదించారు. ‘జగనన్నా.. సీపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తావన్నా’ అంటూ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నెల 31లోగా సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తెలియజేయకపోతే.. సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో, ఏపీసీపీఎస్ ఆధ్వర్యంలో మహా నిరసన ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.