సెప్టెంబర్‌లో థర్డ్ వేవ్ పక్కా.. రోజుకు 5 లక్షల కేసులట.. నీతి ఆయోగ్ హెచ్చరిక..
posted on Aug 23, 2021 @ 10:05AM
థర్డ్ వేవ్ లేదు ఏమీ లేదు. జనాలు చూడు ఎంత బిందాస్‌గా తిరుగుతున్నారో. కేసులు కూడా పెద్దగా ఏమీ రావట్లేదు. ప్రజల్లో సైతం కరోనా భయం లేదు. సెకండ్ వేవ్ ముగిసిందని తెలంగాణ అధికారికంగానే ప్రకటించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో బోనాల పండగ జోరుగా జరిపారు. అయినా, కేసులు అంతంతే ఉన్నాయి. ఏపీలో స్కూల్స్ కూడా తెరిచారు. ఇలా మొత్తం అన్‌లాక్ అవుతోంది. రాబోవు వినాయక చవితి సైతం పెద్ద ఎత్తున జరపాలని భావిస్తున్నారు. రాష్ట్రాల తీరు ఇలా ఉంటే.. కేంద్రం మాత్రం కరోనా కట్టడిపై పదే పదే హెచ్చరిస్తోంది. మీరు చేస్తున్నది తప్పు.. ఇంకా కొవిడ్ ముప్పు పోలేదంటూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. అయినా, రాష్ట్రాలు పట్టించుకుంటేగా. తాజాగా, నీతి ఆయోగ్ మరో వైరస్ బాంబ్ వదిలింది. కరోనా ఎక్కడికీ పోలేదని.. థర్డ్ వేవ్‌కు రెడీ అవుతోందని.. మూడో ముప్పు మరింత డేంజరస్‌గా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇస్తోంది. సెప్టెంబర్‌లోనే ముహూర్తం అంటూ ముచ్చెమటలు పట్టిస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి మరోమారు వికృతరూపం చూపనుంది. లేటెస్ట్‌గా నీతి ఆయోగ్ కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని అలర్ట్ చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ పరిస్థితులకు తగ్గట్టు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది.
2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. గతంలొ సెకండ్ వేవ్ గురించి కూడా నీతి ఆయోగ్ కరెక్ట్‌గా అంచనా వేసింది. ఇప్పుడు మూడో ముప్పు గురించి తెలపడంతో ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అవుతున్నారు.
ఆగస్టులో కొవిడ్ కేసులు నియంత్రణలోనే ఉన్నాయి. దేశంలో గత 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 403 మంది చనిపోయారు.