యువగళంతో గొంతు కలిపిన జనం.. నిర్బంధాల నడుమ విజయయాత్రలా లోకేష్ పాదయాత్ర!
posted on Mar 2, 2023 @ 10:16PM
తెలుగుదేశంజాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటింది. అగుగడుగునా జన నీరాజనంతో ఆయన యాత్ర సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలు చేశారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేశారు. ఆ ముగ్గురూ కూడా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలతో లభించిన ప్రజాదరణ కారణంగానే ముగ్గురూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు.
అయితే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే. కానీ గతంలో జరిగిన మూడు పాదయాత్రలతో పోలిస్తే నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర చాలా ప్రత్యేక మైనది. గతంలో వైఎస్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ పాదయాత్రలు చేసిన సమయంలో ఆంక్షలు లేవు, అవరోధాలు లేవు, అడ్డంకులు లేవు. ప్రభుత్వాలు ఆ పాదయాత్రల సమయంలో పూర్తి భద్రత కల్పించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేశాయి. అవసరమైన అన్ని అనుమతులూ ఇవ్వడమే కాకుండా.. పాదయాత్రలో పాల్గొన్న వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి.
కానీ లోకేష్ పాదయాత్ర కు అలాంటి వెసులుబాటులేవీ లేవు. ఆయన అడుగుతీసి అడుగువేయాలంటే యుద్ధమే చేయాల్సి వస్తోంది. అడుగడుగునా ఆంక్షలే. మాట్లాడుతుంటే పోలీసులు మైకు లాగేసుకుంటున్నారు. నిలుచున్న స్టూలును కూడా తీసేస్తున్నారు. వెంట వచ్చే వాహనాలు లేవు. ప్రచార రథాలను సీజ్ చేసేశారు. ఆయన పాదయాత్రకు రాకుండా జనాలను అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. ఇవి చాలవన్నట్లు అధికార పార్టీయే పాదయాత్రకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తోంది. జనాదరణ లేదు అని ప్రచారం చేయడానికి నానా అగచాట్లూ పడుతోంది. అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ పాదయాత్ర విఫలం అన్న ప్రచారం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరాఖరికి ఆయన పాదయాత్ర కంటే ముందు ఆయన రూట్ లో ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రీకరించి జనం లేని యాత్ర అని బిల్డప్ ఇచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది.
గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేసిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ మాత్రం ఖాళీ రహదారుల ఫోటోల కోసం పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అలా ఖాళీ రహదారల పొటోలు పంపకుంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ హెచ్చరిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.
వీటన్నిటికీ తోడు అధికార పార్టీ శ్రేణుల దాడుల భయం. దాడులను నిరోధించడానికి పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో సాగుతున్నది కనుకనే లోకేష్ పాదయాత్ర గత పాదయాత్రలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైనది. అలాగే ఎంతో సాహసోపేతమైనదని చెప్పవచ్చు. ఇక లోకేష్ తన పాదయాత్రలో జనంతో మమేకమౌతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తనదైన శైలిలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎడాపెడా హామీలిచ్చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చడం గురించి మరచిపోయారు. విపక్షాలు నిలదీసిన సందర్భంగా ఆయన కేబినెట్ సహచరులు ఆ హామీలు జగన్ ఇవ్వలేదని బుకాయించడమే కాకుండా మా మేనిఫెస్టో చూసి మాట్లాడండి అంటూ ఎదురుదాడికి దిగారు. ఇ
ప్పుడు లోకేష్ తన పాదయాత్రలో భాగంగా గతంలో జగన్ ఇచ్చిన మీలను గుర్తు చేసి ప్రజల నుంచే అవి అమలయ్యాయో లేవో తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా తాను ఇచ్చిన హామీలను ప్రతి వంద కిలోమీటర్ల వద్దా శిలాఫలపై చెక్కించి ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన నాలుగు వందల కిలోమీటర్ల పైన సాగిన పాదయాత్రలో నాలుగు శిలాఫలకాలను ఆవిష్కరించారు. తాను ఇచ్చిన హామీలన్నీ శిలాఫలకాలపై ఉన్నాయనీ, వాటిని అధికారంలోకి వచ్చాకా విస్మరిస్తే నిలదీసి ప్రశ్నించాలని ప్రజలకు చెబుతున్నారు. ఇక ఎక్కడిక్కడ సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు ప్రజలలో ఆయన ఇమేజ్ ను పెంచుతోందని పరిశీలకులు అంటున్నారు.