బ్రహ్మంగారి నివాసాన్ని పునర్నిర్మిస్తాం.. కలెక్టర్
posted on Oct 30, 2025 @ 10:39AM
మంథా తుఫాన్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కూలిపోయిన కాలజ్ణాని, జగద్గురు శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాస గృహాన్ని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బుధవారం (అక్టోబర్ 29) రాత్రి పరిశీలించారు. ఈ నివాసాన్ని తిరిగి అద్భుతమైన కట్టడంగా, ,భక్తులమనోభావాలను గౌరవిస్తూ ముందున్న ఆకృతిలోనే నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ఈ సందర్బంగా అయన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, మఠ నిర్వాహకులు, బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గృహం కూలడానికి దారితీసిన కారణాలను ఆరా తీశారు. ఈ పవిత్ర పురాతన గృహం మట్టి, పలకరాయి, చెక్క స్తంభాల ఆధారంగా నిర్మితమైనదనీ, దీర్ఘకాల వాతావరణ మార్పులూ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా చెక్క స్తంభాలు బలహీనపడి, గోడలు కూలిపోయాయని వారు కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన కలెక్టర్ భక్తుల మనోభావాలనుగౌరవిస్తూ పునర్నిర్మిస్తామన్నారు. ఇది కేవలం ఒక గృహం కాదు, భక్తుల ఆరాధనకు, మన సంస్కృతికి ప్రతీక అన్న ఆయన ఈ పవిత్ర స్థలంలో, అదే రూపంలో, అదే నిర్మాణ శైలిలో బ్రహ్మంగారి నివాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటాక్ సంస్థ సహకారంతో, పురాతన శైలిని కోల్పోకుండా, పూర్వపు మట్టి, రాయి, చెక్క వంటి పదార్థాలను ఉపయోగిస్తూ ప్రత్యేక ఆర్కిటెక్చర్ నిపుణుల సలహాలతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.అలాగే ధార్మిక పరిషత్ సలహాలు, తీసుకుంటామని తెలిపారు.